Video: షేర్వాణీలో విలియం సందడి.. ఏంటి ఎర్త్‌షాట్‌ అవార్డులు? రూ. కోట్లలో ప్రైజ్‌ మనీ

Earthshot Prize 2026: పదేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన బ్రిటన్ రాజ దంపతులు ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ ముంబైలో సందడి చేసారు. ఎర్త్‌షాట్ ప్రైజ్ 2026 అవార్డుల వేడుకలో పాల్గొన్న వీరిద్దరూ పాశ్చాత్య దుస్తులను పక్కనపెట్టి భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ముఖ్యంగా ఎరుపు రంగు అనార్కలీలో కేట్ మిడిల్టన్ కనిపించిన తీరు ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది.

Video: షేర్వాణీలో విలియం సందడి.. ఏంటి ఎర్త్‌షాట్‌ అవార్డులు? రూ. కోట్లలో ప్రైజ్‌ మనీ
Kate Middleton And Prince William In Indian Attire At Earthshot Prize Awards

Updated on: Nov 18, 2026 | 10:31 AM

ప్రిన్స్ విలియం 2020లో ప్రారంభించిన ఎర్త్‌షాట్ ప్రైజ్ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలకు  పరిష్కారాలను అందించే వ్యక్తులు, సంస్థలను గుర్తించి ప్రోత్సహిస్తుంది. ఈ ఏడాది మొత్తం 15 మంది ఫైనలిస్టులు ఐదు విభాగాల్లో పోటీపడ్డారు. ప్రతి విభాగంలో ఒక్కో విజేతను ఎంపిక చేసి, వారికి 10 లక్షల బ్రిటిష్ పౌండ్ల చొప్పున బహుమతి అందించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.12 కోట్లకు పైనే ఉంది.
నవంబర్ 30న ప్రైమ్ వీడియో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది

ఐదుగురు విజేతలకు రూ. కోట్లలో బహుమతులు

నవంబర్ 16, 17 తేదీల్లో ముంబైలో జరిగిన ఎర్త్‌షాట్ ప్రైజ్ 2026 కార్యక్రమంలో బాలీవుడ్ నటులు షాహిద్ కపూర్, తమన్నా, త్రిప్తి డిమ్రి, షనాయా కపూర్ సందడి చేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, నటి ఆలియా భట్, గాయని శ్రేయా ఘోషల్, సోనమ్ కపూర్, నటి సిమోన్ యాష్లే పాల్గొన్నారు.  తొలిసారిగా ఆరవ ఎడిషన్‌ ను ముంబైలో నిర్వహించారు.

మనీష్ మల్హోత్రా డిజైన్‌లో ప్రిన్స్ విలియం

కేట్ మిడిల్టన్ ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ మహిమా మహాజన్ రూపొందించిన ఎరుపు రంగు అనార్కలీని ధరించారు. డైమండ్ నెక్లెస్‌లు, ఆకర్షణీయమైన డ్రాప్ ఇయర్ రింగులు పెట్టుకున్నారు. ప్రిన్స్ విలియం కూడా భారతీయ ఫ్యాషన్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన నల్లటి బంద్‌గలాను ధరించారు. భారతీయ డిజైనర్ల సృజనాత్మకతకు అంతర్జాతీయ వేదికపై మరోసారి గుర్తింపు లభించినట్లయింది.

Bhutan and Niue ocean trust win 2026 Earthshot Prizes

మెట్రో ప్రయాణం.. గల్లీ క్రికెట్..ఆటో రైడ్!

భారత్ పర్యటనలో ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ ఒక్కో కార్యక్రమంతో వార్తల్లో నిలుస్తున్నారు. ముంబైకి చేరుకున్నప్పటి నుంచి ప్రజలతో మమేకమవుతూ సందడి చేసారు. ముంబై మెట్రోలో ప్రయాణించి ఆశ్చర్యపరిచారు. చిన్నారులతో గల్లీ క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా వారితో కలిశారు. ఆటో నడిపి అందరి దృష్టిని ఆకర్షించారు. నవంబర్ 16న ముంబై చేరుకున్న ఈ రాజ దంపతులు మూడు రోజుల పర్యటనలో భాగంగా ఎర్త్‌షాట్ ప్రైజ్‌కు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్‌గా ప్రిన్స్ విలియం

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు. ఎలక్ట్రిక్ ఆటో స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేస్తుంటే ఆయన భార్య కేట్ మిడిల్టన్ వెనుక సీటులో కూర్చుని ప్రయాణాన్ని ఆస్వాదించారు. ముంబై సముద్ర తీరంలో సాగిన ఈ రాయల్ ఆటో రైడ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఎర్త్‌షాట్ ప్రైజ్ కార్యక్రమాల్లో భాగంగా ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ ఎలక్ట్రిక్ ఆటోలో ప్రయాణించారు. బాంద్రా-వర్లీ సీ లింక్ అందాలను చూస్తూ వీరిద్దరూ సరదాగా గడిపారు

ప్రిన్స్ విలియం నడిపిన ఆటో కేవలం ప్రయాణం కోసమే ఏర్పాటు చేసిన వాహనం కాదు. దీని వెనుక పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రత్యేక సందేశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ సంస్థ ఈ ఏడాది ఎర్త్‌షాట్ ప్రైజ్‌కు ఎంపికైన 15 ఫైనలిస్టుల్లో ఒకటి.

‘మీ ఆటోను ఢీకొట్టలేదు..ఓకే కదా!’

ఆటో ప్రయాణం ముగిసిన తర్వాత కూడా అక్కడ నవ్వులు ఆగలేదు. వాహనం నుంచి దిగిన ప్రిన్స్ విలియం తన అనుభవాన్ని చాలా సరదాగా పంచుకున్నారు. ఈ రైడ్ అద్భుతంగా ఉందంటూ ‘బ్రిలియంట్’ అని ప్రశంసించారు. ఇక వెనుక సీటులో కూర్చున్న కేట్ మిడిల్టన్ కూడా ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉందంటూ థంబ్స్ అప్ చూపించారు. అనంతరం మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ సీఈఓ సుమన్ మిశ్రాతో విలియం సరదాగా మాట్లాడారు. ‘నేను మీ వాహనాన్ని ఢీకొట్టలేదు.. కాబట్టి మీరు ఓకే కదా!’ అంటూ నవ్వుతూ చమత్కరించారు. ఆయన మాటలకు అక్కడున్నవారు నవ్వుకున్నారు. రాజకుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఎలాంటి హడావుడి లేకుండా సరదాగా ఆటో నడపడం అందరినీ ఆకట్టుకుంది.

 

 

Video of Prince William drives Kate Middleton in e-rickshaw in Mumbai

ముంబై పర్యటనలో ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ తమ రాజసాన్ని పక్కనపెట్టి స్థానిక జీవనశైలిలో కలిసిపోయారు. మెట్రోలో ప్రయాణం, చిన్నారులతో క్రికెట్, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో రైడ్.. ఇలా ఒక్కో అనుభవంతో ముంబై ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా ఆటో నడుపుతున్న విలియం, వెనుక సీటులో చిరునవ్వుతో కేట్ వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us