ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆసుపత్రి పాలైన భార్య!

ప్రేమను వ్యక్తీకరించే మార్గాలలో కౌగిలింత అత్యంత మధురమైనది. భాగస్వామిని ప్రేమగా హత్తుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కానీ, చైనాలో చోటు చేసుకున్న ఒక విచిత్రమైన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. భర్త ప్రేమగా కౌగిలించుకోవడం వల్ల భార్య పక్కటెముకలు విరిగి ఆసుపత్రి పాలైన వైనం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆసుపత్రి పాలైన భార్య!
Husband Tight Hug

Updated on: Oct 24, 2026 | 7:57 AM

చైనాలోని జియాంగ్స్‌ ప్రావిన్స్‌లో ఒక విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. తనకు చలిగా ఉందని చెప్పిన భార్యను భర్త వాంగ్‌ ఎంతో ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్నాడు. అయితే ఈ ఆలింగనం ఆమెకు తీవ్రమైన నొప్పితో పాటు ఆసుపత్రిపాలు చేసింది. ఛాతిలో తీవ్ర నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లిన భార్యకు వైద్యులు పరీక్షించగా, ఆమెకు ఏకంగా ఐదు పక్కటెముకలు విరిగినట్లు, మరో చోట పగులు ఉన్నట్లు తేలింది. అసలు ఏం జరిగింది?

చైనాలోని జియాంగ్స్‌ ప్రావిన్స్‌లో వ్యాపారం నిర్వహించే వాంగ్‌ అనే వ్యక్తి తన 39 ఏళ్ల భార్యతో కలిసి ఉంటున్నాడు. ఒకరోజు సాయంత్రం చలిగా ఉందని భార్య అనడంతో, ఆమెపై ప్రేమతో వాంగ్‌ తన రెండు చేతులతో ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. భార్య కూడా ఆప్యాయంగా అతడి మెడ చుట్టూ చేతులు వేసి తిరిగి హత్తుకుంది. అయితే కొద్దిసేపటికే ఆమె ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో కుప్పకూలిపోయింది. నొప్పితో నడవలేని పరిస్థితి ఏర్పడటంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

వైద్యుల పరీక్షల్లో విస్తుపోయే నిజాలు:

ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు సిటి స్కాన్ చేసి పరీక్షించగా అసలు విషయం బయటపడింది. ఆమె ఎడమవైపు 5 నుండి 8 వరకు ఉన్న పక్కటెముకలు, కుడివైపు భాగంలో ఒక పక్కటెముక మొత్తం కలిపి ఐదు పక్కటెముకలు విరిగినట్లు, మరొకటి పగులు తీసినట్లు వైద్యులు గుర్తించారు.

ఎముకలు బలహీనపడటమే అసలు కారణం:

ఈ ఘటనపై వైద్యులు స్పందిస్తూ.. కేవలం సాధారణ కౌగిలింతకే ఎముకలు విరిగిపోవడానికి కారణం ఆమె శరీరం బలహీనంగా ఉండటమేనని తేల్చేశారు. ఆ మహిళ బరువు కేవలం 45 కిలోలు మాత్రమేనని, బరువు తగ్గేందుకు తరచూ రాత్రి భోజనం మానేసే అలవాటు ఉందని తేలింది. అంతేకాకుండా, ఎల్లప్పుడూ దుకాణంలోనే గడపడం వల్ల ఆమెకు ఎండ తగల లేదని, దీనివల్ల ఆమెలో విటమిన్ డి లోపించి ఆస్టియోపొరోసిస్ సమస్య వచ్చి ఉంటుందని వైద్యులు తెలిపారు.

తన భార్యను కేవలం ప్రేమతోనే కౌగిలించుకున్నానని, ఆ చిన్న ఆలింగనానికే ఆమె ఎముకలు విరిగిపోతాయని తాను కలలో కూడా ఊహించలేదని భర్త వాంగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us