
పాము అంటే భయపడని వారు ఎవరుంటారు. అది కనిపిస్తే చాలు పరిగెత్తేవారు ఎంతో మంది. ఇక ఇంట్లోకి వస్తే ఆ భయం, టెన్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక వర్షకాలం మొదలైందంటే చాలు.. పాములు ఇళ్లలోకి వస్తుంటాయి. ముఖ్యంగా ఇంటి చుట్టుపక్కల పార్కులు, చెట్లు, పొలాలు, డ్రైనేజీలు లేదా కొండ ప్రాంతాలు ఉంటే పాములు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. పాము కాట్ల వల్ల ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇళ్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పాములు రావడానికి జంకుతాయి. పాములనే భయపెట్టే వాసనల గురించి తెలుసుకుందాం..
మనుషులతో పాటు నెమళ్లు, ముంగిసలు, గద్దలు అంటే పాములకు భయం. అలాగే మంట, పెద్ద శబ్దాలు ఉన్న చోటికి అవి రావు. వీటన్నింటితో పాటు కొన్ని రకాల ఘాటైన వాసనలను పాములు అస్సలు తట్టుకోలేవు. ఉల్లిపాయలు, వెల్లుల్లి ఘాటు, వెనిగర్, పుదీనా వాసనలకు పాములు దూరంగా పారిపోతాయి.
కొన్ని రకాల మొక్కల నుంచి వచ్చే ప్రత్యేకమైన వాసనలు పాములను దరిచేరనీయవు. కాబట్టి వీటిని బాల్కనీ, తులసి కోట దగ్గర లేదా పాములు వచ్చే అవకాశం ఉన్న ద్వారాల వద్ద కుండీల్లో పెంచుకోవచ్చు.
సర్పగంధ : దీని పేరులోనే ఉన్నట్లు.. ఈ మొక్క ఘాటుకు పాములు అస్సలు రావు.
గరుడ వృక్షం : ఈ చెట్టు పండ్లు పాము ఆకారంలో ఉండి, విషాన్ని విరిచేసే గుణాలు కలిగి ఉంటాయి.
ఇతర మొక్కలు: స్నేక్ ప్లాంట్, బంతి పూల మొక్కలు, లెమన్ గ్రాస్ , కలబంద, తులసి మొక్కలను పెంచడం మంచిది.
ఫినాయిల్ లేదా కిరోసిన్: ఇంట్లోకి పాము దూరితే అస్సలు కంగారు పడకుండా.. ఫినాయిల్ లేదా కిరోసిన్‌ను ఇల్లంతా చల్లాలి. ఆ ఘాటైన వాసనకు పాము బయటకు వెళ్ళిపోతుంది. అయితే అది బయటకు వెళ్ళడానికి ఒకట్రెండు తలుపులు లేదా కిటికీలు తెరిచి ఉంచాలి.
లవంగం, దాల్చినచెక్క నూనె: లవంగాల నూనె, దాల్చినచెక్క నూనెలను సమానంగా కలిపి దూరం నుండి పాముపై స్ప్రే చేసినా అది వెంటనే పారిపోతుంది.
ఇంటి చుట్టుపక్కల చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. పెరట్లో పెరిగిన చిన్న చిన్న పొదలు, పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలి. పాములకు ఎలుకలంటే మహా ఇష్టం. ఎలుకల వేటలోనే అవి ఎక్కువగా ఇళ్లలోకి వస్తుంటాయి. కాబట్టి ఇంట్లో ఎలుకలు లేకుండా చూసుకోవడం ముఖ్యం. కిటికీలు, తలుపుల క్రింద ఉండే సందులను, గోడల పగుళ్లను పూర్తిగా మూసివేయాలి.