
గోవా టూర్ ముగించుకుని తిరిగొస్తూ అక్కడి ఫేమస్ ఫెనీ, వైన్ లేదా నచ్చిన బ్రాండ్ విస్కీని తెచ్చుకోవాలనుకుంటున్నారా? లేదా విదేశాల నుంచి వస్తూ కనెక్టింగ్ డొమెస్టిక్ ఫ్లైట్‌లో మీ ఊరికి మద్యం తీసుకెళ్తున్నారా? అయితే విమానాల్లో మద్యం రవాణాకు సంబంధించి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్దేశించిన కఠిన నిబంధనలపై అవగాహన ఉండటం అత్యంత ముఖ్యం. నిబంధనలు తెలియక చాలామంది ఎయిర్‌పోర్టులలో సెక్యూరిటీ చెకింగ్ వద్ద చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో దేశీయ విమానాల్లో మద్యం తీసుకెళ్లడానికి సంబంధించి అమల్లో ఉన్న కీలక మార్గదర్శకాల గురించి అందరూ తెలుసుకోవాలి.
ఆల్కహాల్ పరిమాణం (24 నుంచి 70శాతం): విస్కీ, రమ్, వోడ్కా, జిన్ వంటి డ్రింక్స్‌లో సాధారణంగా ఆల్కహాల్ శాతం 24 నుంచి 70శాతం వరకు ఉంటుంది. నిబంధనల ప్రకారం ఒక ప్రయాణికుడు గరిష్టంగా 5 లీటర్ల వరకు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
70శాతం కంటే ఎక్కువ ఉంటే నో ఎంట్రీ: ఆల్కహాల్ పరిమాణం 70 శాతం మించిన ఘాటైన మద్యాన్ని మండే స్వభావం కలిగిన ప్రమాదకర పదార్థంగా పరిగణిస్తారు. దీన్ని విమానంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు.
బీర్, వైన్లకు వర్తించని 5 లీటర్ల నిబంధన: 24శాతం కంటే తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే వైన్, బీర్లకు 5 లీటర్ల పరిమితి వర్తించదు. కానీ ఎయిర్‌లైన్ అనుమతించిన చెక్ ఇన్ బ్యాగేజీ మొత్తం బరువు పరిమితికి లోబడి ఉండాలి.
ఒరిజినల్ ప్యాకింగ్ తప్పనిసరి: మద్యం బాటిళ్లు కంపెనీ ఇచ్చిన అసలైన రిటైల్ ప్యాకేజింగ్‌లో, పగలని విధంగా భద్రపరిచి ఉండాలి. సీల్ తీసిన లేదా సగం వాడిన బాటిళ్లను తీసుకెళ్లడం పూర్తిగా నిషిద్ధం.
చెక్ ఇన్ బ్యాగేజీలోనే ఉంచాలి: సాధారణంగా హ్యాండ్ బ్యాగ్‌లో మద్యం తీసుకెళ్లేందుకు అనుమతించరు. బాటిళ్లను కేవలం చెక్ ఇన్ లగేజీలోనే భద్రపరుచుకోవాలి.
డ్యూటీ ఫ్రీ కొనుగోళ్లు: సెక్యూరిటీ చెక్ పూర్తయిన తర్వాత సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలోని డ్యూటీ ఫ్రీ షాపుల్లో కొనుగోలు చేసిన మద్యం సీసాలను, అధికారిక సీల్డ్ పౌచ్‌లలో ఉంచితే విమానయాన సంస్థ నిబంధనల మేరకు క్యాబిన్ బ్యాగేజీగా తీసుకెళ్లవచ్చు.