పక్షుల లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్.. చిన్న సీక్రెట్‌తో మగపక్షి మోసాన్ని ఇట్టే పట్టేస్తాయ్..

ఒకరి గొంతు విని వాళ్లు సింగిలా లేక కమిటెడ్డా అని చెప్పడం మనుషులకు అసాధ్యం కావచ్చు.. కానీ పక్షుల ప్రపంచంలో మాత్రం ఇది ఇట్టే తెలిసిపోతుంది. ఎదుటి మగ పక్షి పాడే పాటను బట్టి దానికి అప్పటికే జోడీ ఉందా లేదా అనే సీక్రెట్‌ను కనిపెట్టేసే అరుదైన సామర్థ్యం ఓ పక్షి జాతి సొంతం. పైడ్ ఫ్లైక్యాచర్ పక్షుల ప్రవర్తన వెనుక దాగున్న ఈ విచిత్రమైన రహస్యాలు శాస్త్రవేత్తలనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

పక్షుల లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్.. చిన్న సీక్రెట్‌తో మగపక్షి మోసాన్ని ఇట్టే పట్టేస్తాయ్..
Pied Flycatcher Mating Song

Updated on: Aug 22, 2026 | 5:17 PM

ఒకరి గొంతు లేదా పాడే శైలిని విని వాళ్లకు అప్పటికే పెళ్లయిందా లేదా ఎవరితోనైనా రిలేషన్‌లో ఉన్నారా అని చెప్పడం మనుషులకు అసాధ్యం. కానీ ప్రకృతిలో ఉండే ఒక ప్రత్యేక జాతి పక్షికి మాత్రం ఈ అద్భుతమైన సామర్థ్యం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రముఖ సైన్స్ జర్నల్ ఎథాలజీలో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం.. పైడ్ ఫ్లైక్యాచర్ అనే పక్షులలో ఆడ పక్షులు కేవలం మగ పక్షి పాట ఆధారంగానే అది బ్రహ్మచారా లేక అప్పటికే జతకట్టిందా అనే విషయాన్ని పసిగట్టేస్తున్నట్లు తేలింది. పైడ్ ఫ్లైక్యాచర్ జాతి మగ పక్షులు పాలిటెరిటోరియాలిటీ అనే విలక్షణమైన సంతానోత్పత్తి వ్యూహాన్ని అనుసరిస్తాయి. మొదటి ఆడ పక్షితో జతకట్టి అది గుడ్లు పెట్టిన తర్వాత, ఈ మగ పక్షి అక్కడి నుంచి కొన్ని వందల మీటర్ల దూరంలో మరో ప్రాంతానికి వెళ్లి, రెండో ఆడ పక్షిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ క్రమంలో మగ పక్షి పాడే పాటలో కీలక మార్పులు వస్తాయని ఎథాలజిస్ట్ డాక్టర్ హెలెన్ లాంపే బృందం గుర్తించింది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు దాదాపు 2 సెకన్ల పాటు సాగే పాట, మొదటిసారి జతకట్టిన తర్వాత 1.7 సెకన్లకు తగ్గిపోతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే శబ్దాన్ని పదే పదే రిపీట్ చేసే మగ పక్షి, జతకట్టిన తర్వాత వేర్వేరు శబ్దాల మధ్య వేగంగా మారుతూ తక్కువగా రిపీట్ చేస్తుంది.

ఆడ పక్షులకు ఎలా తెలుస్తుంది?

పరిశోధకులు ఆడ పక్షుల గూళ్ల సమీపంలో స్పీకర్లను అమర్చి బ్రహ్మచారిగా ఉన్న మగ పక్షుల పాటలు, అప్పటికే జతకట్టిన మగ పక్షుల పాటలను వేర్వేరుగా వినిపించారు. ప్రయోగంలో పాల్గొన్న 29 ఆడ పక్షులలో 21 ఆడ పక్షులు కేవలం బ్రహ్మచారి మగ పక్షుల పాటలు వినిపించిన గూళ్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపాయి. ఆ తర్వాత బ్రహ్మచారి పక్షి పాటను డిజిటల్ పద్ధతిలో జతకట్టిన పక్షి పాటలా మార్చగా ఆడ పక్షులు వాటిపై ఆసక్తిని కోల్పోయాయి.

మగ పక్షులు పాటను ఎందుకు మారుస్తాయి?

మొదటి భాగస్వామి తన గొంతును గుర్తుపట్టి అక్కడికి వచ్చి రెండో ఆడ పక్షిని తరిమికొట్టకుండా ఉండేందుకు మగ పక్షి పాటను చిన్నదిగా చేసి ఉండవచ్చని ఒక అంచనా. ఇతర మగ పక్షుల నుంచి పోటీని ఎదుర్కొనేందుకు, తన భూభాగాన్ని కాపాడుకునేందుకు ఈ మార్పు చేసుకుంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

ఇది మోసమా? సహజ ఎంపికా?

దీనిని మనుషుల కోణంలో మోసం అని పిలవలేమని డ్యూక్ యూనివర్సిటీ ప్రవర్తనా నిపుణుడు స్టీఫెన్ నోవికీ స్పష్టం చేశారు. ఇది వాటి సంతానోత్పత్తి విజయావకాశాలను పెంచుకోవడానికి కాలక్రమేణా పరిణామం చెందిన ఒక సహజ ఎంపిక మాత్రమే. అయితే ఆడ పక్షులకు మాత్రం ఇది ఎంతో కీలకం. ఎందుకంటే అప్పటికే జతకట్టిన మగ పక్షి రెండు గూళ్ల మధ్య సమయాన్ని కేటాయించాల్సి రావడం వల్ల పుట్టబోయే పిల్లల సంరక్షణలో అది తక్కువ సహాయం మాత్రమే చేయగలదు. అందుకే అవి బ్రహ్మచారి మగ పక్షులకే తొలి ప్రాధాన్యం ఇస్తాయని ఈ పరిశోధన స్పష్టం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us