
భూమిపై అత్యంత కఠినమైన, సవాలుతో కూడిన వాతావరణం ఎడారుల సొంతం. చుక్క నీరు దొరకని కరవు, కాలు పెడితే మాడిపోయే వేడి ఇసుక తిన్నెలు.. ఇక్కడ సాధారణ ప్రాణులు కొద్ది గంటలు కూడా బతకలేవు. కానీ అటువంటి ప్రాణాంతక పరిస్థితులలోనూ కొన్ని పాములు దర్జాగా మనుగడ సాగిస్తున్నాయి. ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన శరీర నిర్మాణం, వింత అలవాట్లు, సూపర్ పవర్స్‌ను తలపించే రక్షణ వ్యూహాలతో ఎడారి తీవ్రతను ఇవి ఎలా జయిస్తున్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఎడారిలో ఎండ తీవ్రతకు ఇసుక నిప్పుల కొలిమిలా మారుతుంది. అలాంటి నేలపై సాధారణ పాముల్లా నేరుగా పాకితే శరీరం కాలిపోతుంది. అందుకే సైడ్‌వైండర్ పాము ఎస్ ఆకారంలో పక్కకు ఏటవాలుగా పాకుతుంది. తన శరీరాన్ని పూర్తిగా ఇసుకపై ఆనించకుండా, ఎప్పటికప్పుడు గాల్లోకి లేపుతూ ముందుకు సాగుతుంది. దీనివల్ల వేడి ఇసుక తగిలే విస్తీర్ణం తగ్గి, శరీరం వేడెక్కకుండా ఉంటుంది. వదులుగా ఉండే ఇసుక దిబ్బలపై ఇది అత్యంత వేగంగా జారుతూ దూసుకుపోగలదు.
ఆస్ట్రేలియా ఎడారుల్లో కనిపించే ఈ వింత బల్లి శరీరమంతా ముళ్లతో భయంకరంగా కనిపిస్తుంది. వేటాడే జంతువుల నుంచి తప్పించుకోవడానికి ఈ ముళ్లు ఉపయోగపడతాయి. అయితే దీని చర్మంలో ప్రకృతి సిద్ధమైన ఒక అద్భుతమైన వ్యవస్థ దాగి ఉంది. దీని శరీరంపై ఉండే సన్నని గాడులు వర్షపు చినుకులు, మంచు తుంపర్లు లేదా తడి ఇసుకలోని తేమను కేశనాళికా ప్రక్రియ ద్వారా ఆటోమేటిక్‌గా పీల్చుకుని నేరుగా నోటిలోకి పంపుతాయి. అంటే ఇది తాగడానికి నీళ్ల కోసం వెతకాల్సిన పనే లేదు. తేమ తగిలితే చాలు చర్మమే దాహార్తిని తీర్చేస్తుంది.
నీటిని దాచుకోవడంలో ఎడారి తాబేలుకు తిరుగులేదు. వర్షం పడినప్పుడు లేదా నీరు దొరికినప్పుడు ఇది తన శరీర బరువులో ఏకంగా 40 శాతం వరకు నీటిని తన మూత్రాశయంలో (నిల్వ చేసుకోగలదు. కఠినమైన ఎండాకాలంలో ఆ నీరే దీనిని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా పగటిపూట నిప్పులు చెరిగే ఎండల వేళ లోతైన భూగర్భ బొరియల్లో దాక్కుని, రాత్రి చల్లబడ్డాక మాత్రమే ఆహారం కోసం బయటకు వస్తుంది.
ఈ బల్లి శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించే ట్రిక్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. వేటాడే జంతువులు దాడికి వచ్చినప్పుడు, ఇది తన కంటిలోని రక్తనాళాలపై ఒత్తిడి పెంచి, కళ్ల గుడ్ల నుంచి శత్రువుల ముఖంపైకి రక్తాన్ని బలంగా చిమ్ముతుంది. ఆ రక్తంలోని విచిత్రమైన రసాయన రుచి, వాసన వల్ల శత్రువులు హడలిపోయి పారిపోతాయి. పైగా దీని చదునైన దేహం ఎడారి నేల రంగులో ఇట్టే కలిసిపోయి శత్రువుల కంటికి కనిపించకుండా మాయమవుతుంది.
విషపూరితమైన గిలా మాన్స్టర్ తన ఆహారాన్ని కొవ్వు రూపంలో భారీగా తోక భాగంలో దాచుకుంటుంది. ఆహారం, నీరు దొరకని క్లిష్ట సమయాల్లో తన శరీర జీవక్రియను దాదాపుగా తగ్గించేసుకుని.. ఆ తోకలోని కొవ్వు ఆధారంగా నెలల తరబడి భూమి లోపలే జీవించేస్తుంది. అటు ముళ్ల తోక బల్లి కూడా వేడిని తట్టుకోలేక నేలలో లోతైన సొరంగాలు తవ్వి అందులోనే రోజులను గడిపేస్తుంది.
చేపలు నీటిలో ఎలా ఈదుతాయో, సాండ్ఫిష్ స్కింక్ అనే బల్లి ఎడారి ఇసుకలో అలా ఈదుకుంటూ పోతుంది. దీని పొలుసులు ఎంతో నునుపుగా ఉండి ఎలాంటి ఘర్షణ లేకుండా ఇసుక లోపలికి చొచ్చుకుపోవడానికి వీలు కల్పిస్తాయి. వేడి తట్టుకోలేకపోయినా, శత్రువులు వెంటబడినా రెప్పపాటులో ఇసుక కిందకు దూరి అదృశ్యమవుతుంది. మరోవైపు డెసర్ట్ ఇగ్వానా ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ దాటిన తీవ్ర ఉష్ణోగ్రతలలో కూడా ఎలాంటి అలసట లేకుండా చురుగ్గా తిరుగుతూ ఆహారాన్ని వేటాడుతుంది. కరువు పరిస్థితులు, భరించలేని ఎండల మధ్య ఎడారి జీవులు చూపుతున్న ఈ అద్భుతమైన మనుగడ నైపుణ్యాలు ప్రకృతిలోని వింతలకు, జీవ వైవిధ్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.