
కాక్‌పిట్‌లో గొడవ జరుగుతున్న విషయం గుర్తించిన యానివ్.. వెంటనే అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. మరో ప్రయాణికుడితో కలిసి కాక్‌పిట్ తలుపు తెరిచేందుకు ప్రయత్నించారు. చివరకు లోపలికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు సహకరించారు. ఈ ఘటనలో యానివ్ షర్టుపై రక్తపు మరకలు కనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానం సురక్షితంగా ఇజ్రాయెల్‌కు చేరుకున్న తర్వాత యానివ్ హయూన్ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కలిశారు. ఈ సందర్భంగా నెతన్యాహు అతన్ని అభినందించారు. ‘చాలా గొప్ప పని చేశావు. నువ్వు హీరో’ అంటూ ప్రశంసించారు. ఆ తర్వాత విమానంలో జరిగిన పరిణామాలను యానివ్ ప్రధానితో పంచుకున్నారు. విమానంలో లైట్లు ఆగిపోవడం, క్యాబిన్ పరిస్థితుల్లో మార్పులు రావడం నుంచి కాక్‌పిట్‌లోకి వెళ్లే వరకు ఏం జరిగిందో వివరించారు.
విమానం ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా లైట్లు ఆఫ్ అయ్యాయని ప్లంబర్ గా పనిచేస్తున్న హయూన్ తెలిపారు. అదే సమయంలో క్యాబిన్‌లోని గాలి పీడనంలో మార్పును గుర్తించడంతో విమానంలో ఏదో సమస్య తలెత్తిందని భావించి కాక్‌పిట్ వైపు వెళ్లాననీ చెప్పారు. తనతో పాటు మరో ప్రయాణికుడు కూడా అక్కడికి వచ్చాడని, అతను ఆ సమయంలో డ్యూటీ లేని ఓ పైలట్ అని తర్వాత తెలిసిందని హయూన్ చెప్పారు. కాక్‌పిట్ లోపల ఏదో ఘర్షణ జరుగుతున్నట్లు గుర్తించిన హయూన్, మరో ప్రయాణికుడు తలుపు తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే కెప్టెన్ స్మిత్ మచ్చర్ గాయపడి స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ తలుపును అన్‌లాక్ చేశారు. తలుపు తెరుచుకున్న వెంటనే తామిద్దరూ లోపలికి వెళ్లినట్లు వివరించారు. లోపలికి వెళ్లినప్పుడు ఒక పైలట్ నేలపై పడి ఉండగా.. మరో వ్యక్తి విమానం కంట్రోల్స్ దగ్గర ఉన్నట్లు హయూన్ తెలిపారు. అతడే దాడికి పాల్పడిన వ్యక్తిగా భావించి వెంటనే అతడిని కంట్రోల్స్ నుంచి దూరంగా తీసుకెళ్లారు. విమానం ఎత్తు కూడా తగ్గుతున్నట్లు ఆ సమయంలో తనకు అనిపించిందని వివరించారు.
Israeli PM Benjamin Netanyahu has met Yaniv Hayun, the Flydubai passenger that helped restrain a pilot who stabbed a colleague.
Netanyahu called the passenger a ‘hero’ during a meeting at Ben Gurion Airport in Tel Aviv shortly after the flight landed. https://t.co/XAw68rCLMp
— Al Jazeera English (@AJEnglish) September 30, 2026
విమానం అదుపు తప్పే పరిస్థితి కనిపించడంతో హయూన్ వెంటనే కంట్రోల్ స్టిక్స్‌ను పట్టుకున్నారు. ‘కంట్రోల్ స్టిక్స్‌ను నా చేతులతో పట్టుకుని వెనక్కి లాగాను. ఆ తర్వాత విమానం మళ్లీ సాధారణ ఎత్తుకు చేరుకుంటున్నట్లు అనిపించింది’ అన్నారు. విమానం ఎలా అదుపులోకి తీసుకురావాలో తనకు ప్రత్యేక శిక్షణ లేకపోయినా.. గతంలో చూసిన ‘Air Crash Investigation’ టీవీ కార్యక్రమంలో విమాన ప్రమాదాల సమయంలో పైలట్లు ఎలా స్పందిస్తారో చూసిన విషయాలు గుర్తొచ్చాయని హయూన్ తెలిపారు. కాక్‌పిట్‌లో జరిగిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విమానంలో అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు కారణమేంటి? అనే విషయాలపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.