Video: వంటింట్లో మంటలు.. పార్సిల్ ఇచ్చిన డెలివరీ బాయ్‌ సాహసం! వీడియో వైరల్

ఆపదలో ఉన్నప్పుడు మనకు పరిచయం లేని వ్యక్తి దేవుడిలా వచ్చి ప్రాణాలు కాపాడవచ్చు. అలాంటి ఘటనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ ఇంటికి పార్సిల్ ఇవ్వడానికి వెళ్లిన డెలివరీ బాయ్.. అక్కడ వంటగదిలో మంటలు చెలరేగడం గమనించి వెంటనే స్పందించాడు.

Video: వంటింట్లో మంటలు..  పార్సిల్ ఇచ్చిన డెలివరీ బాయ్‌ సాహసం! వీడియో వైరల్
Heroic Delivery Boy Puts Out Kitchen Fire During Parcel Delivery

Updated on: Oct 21, 2026 | 9:18 AM

ఆపదలో ఉన్నప్పుడు మనకు పరిచయం లేని వ్యక్తి  ఆ సమయంలో దేవుడిలా వచ్చి ప్రాణాలు కాపాడవచ్చు. అలాంటి ఘటనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ ఇంటికి పార్సిల్ ఇవ్వడానికి వెళ్లిన డెలివరీ పార్ట్‌నర్‌.. అక్కడ వంటగదిలో మంటలు చెలరేగడం గమనించి వెంటనే స్పందించాడు.

పార్సిల్ తీసుకుంటుండగా వంటగదిలో మంటలు

డాక్టర్ శివాంగి జోషి ఇంటికి ఓ డెలివరీ బాయ్‌ పార్సిల్ తీసుకొచ్చాడు. పార్సిల్ తీసుకోవడానికి శివాంగి ఇంటి గేటు దగ్గరకు వెళ్లారు. అయితే అదే సమయంలో వంటగదిలో స్టవ్‌పై ఉంచిన పాన్ నుంచి పొగలు రావడం మొదలైంది. కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. పార్సిల్ తీసుకుని తిరిగి ఇంట్లోకి వెళ్లిన శివాంగి.. వంటగదిలో మంటలు వ్యాపించడాన్ని గమనించారు. మంటలను ఎలా అదుపు చేయాలో తెలియక ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని గమనించిన డెలివరీ బాయ్‌ వెంటనే స్పందించాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వంటింట్లోకి వెళ్లాడు.

తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ సాయం

వైరల్‌గా మారిన సీసీటీవీ వీడియోలో డెలివరీ బాయ్ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓ వస్త్రం సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. అతడి చొరవతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సాధారణంగా పార్సిల్ ఇచ్చి వెళ్లిపోయే వ్యక్తి .. ఆపద సమయంలో బాధ్యతగా వ్యవహరించి మహిళకు సహాయం అందించాడు. ఈ ఘటనతో భావోద్వేగానికి గురైన శివాంగి జోషి.. డెలివరీ బాయ్ కు థ్యాంక్స్ తెలుపుతూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘నిన్న రాత్రి ఓ డెలివరీ వ్యక్తి మా ఇంటికి పార్సిల్ ఇవ్వడానికి వచ్చాడు. అయితే ఆ పార్సిల్ డెలివరీ నా జీవితంలో అత్యంత భావోద్వేగ జ్ఞాపకాల్లో ఒకటిగా మారుతుందని తెలియదు. మా వంటగదిలో మంటలు చెలరేగినప్పుడు వాటిని ఎలా అదుపు చేయాలో నాకు అర్థం కాలేదు. కానీ అతడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందుకొచ్చి సాయం చేశాడు. మానవత్వం ఇంకా మిగిలే ఉందని గుర్తుచేశాడు’ అని రాసుకొచ్చారు.

‘కొందరు పార్సిళ్లు ఇస్తే.. మరికొందరు జీవితంపై ఆశను ఇస్తారు’

డెలివరీ పార్ట్‌నర్‌ చేసిన సాయాన్ని శివాంగి ప్రశంసించారు. వ్యక్తుల వృత్తి, రూపాన్ని బట్టి వారిని అంచనా వేయకూడదని, ఇతరులకు సాయం చేయాలనే మనసు, ధైర్యం ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండవని తెలిపారు. ‘థ్యాంక్స్‌ చెప్పడానికి నా దగ్గర సరైన మాటలు లేకపోవచ్చు. కానీ చేసిన సాయాన్ని మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటాను. కొంతమంది పార్సిళ్లు అందిస్తారు. మరికొందరు మనకు అవసరమైన సమయంలో ప్రాణాలు నిలబెడతారు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

74 లక్షలకు పైగా వ్యూస్.. డెలివరీ బాయ్‌పై ప్రశంసలు

ఈ వీడియో 74 లక్షలకు పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. డెలివరీ బాయ్‌ సమయస్ఫూర్తిని నెటిజన్లు కొనియాడుతున్నారు. ‘అతని సమయస్ఫూర్తి అద్భుతం .. ప్రశాంతంగా ఉంటూనే పరిస్థితిని చక్కదిద్దాడు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘మంటలను ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా అదుపు చేశాడు..అతడి ధైర్యానికి హ్యాట్సాఫ్’ అంటూ మరో యూజర్ ప్రశంసించారు. ఈ సాహసోపేత పనికి గుర్తింపు దక్కాలంటే డెలివరీ బాయ్ పేరు, అతడు పనిచేస్తున్న సంస్థ వివరాలను వెల్లడించాలని మరికొందరు సూచించారు.  డెలివరీ బాయ్ .. అత్యవసర సమయంలో చూపిన ధైర్యం మనసులు గెలుచుకుంటోంది. మానవత్వానికి హోదా, వృత్తితో సంబంధం లేదని ఈ ఘటన నిరూపించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us