కర్ణాటకలో విషాదం.. ఫ్రిజ్ పేలి నలుగురు మహిళలు మృతి

కర్ణాటకలోని బెళగావిలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లోని రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలిపోవడంతో, నిద్రలోనే నలుగురు మహిళలు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన రాజారాం, బాలుడు రోహన్‌ ను చుట్టుపక్కల వారు శిథిలాల నుంచి బయటకు తీసారు. 

కర్ణాటకలో విషాదం.. ఫ్రిజ్ పేలి నలుగురు మహిళలు మృతి
Four Of A Family Die As Refrigerator Explodes At Karnataka Home

Updated on: Sep 15, 2026 | 5:28 PM

కర్నాటకలోని బెళగావి సెంట్రల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న చవత్ గల్లీలో రాజారాం అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. సోమవారం వినాయకచవితిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.  మంగళవారం తెల్లవారుజామున 2.15 గంటలకు కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లోని ఫ్రిజ్ ఉన్నట్టుండి భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు జరిగిన వెంటనే ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్నవారికి కోలుకునే సమయం కూడా లేకపోవడంతో శారద (50), ఆమె కుమార్తెలు ప్రియ, గంగలతో పాటు భారతి అనే మహిళ అక్కడికక్కడే మంటల్లో కాలిపోయి చనిపోయారు.  అర్ధరాత్రి ఇరుగుపొరుగున ఉన్న యువకులు ధైర్యం చేసి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు.  తీవ్రగాయాలైన రాజారాం, అతని కుమారుడు రోషన్ ను ఎత్తుకొచ్చి ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఇంటికి దగ్గర్లో ఉన్న వినాయక మండపానికి, ఇతర ఇళ్లకు మంటలు వ్యాపించడంతో ఆర్పేసారు.  క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారి శరీరాలు 60 శాతానికి పైగా కాలిపోయినట్లు అధికారులు తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షార్ట్ సర్య్కూట్‌తోనే మంటలు చెలరేగి ఉండవచ్చని అవి ఫ్రిజ్‌కు అంటుకున్నాయని, దాంతో అది పేలి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  అయితే, ఇటీవలే కొత్త ఫ్రిజ్ ను కొనుగోలు చేసినట్లు తెలిసింది.  ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం  అలుముకుంది. కూలీ పనులు చేసుకునే రాజారాం కుటుంబంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడంతో బంధువులు, స్థానికులు రోదించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us