పులికి హార్ట్ ఎటాక్ వస్తుందా..? సైన్స్ చెప్పే ఈ నిజాలు 99శాతం మందికి తెలియదు..

నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వస్తుందని మనుషులు భయపడతారు. మరి రోజూ పచ్చి మాంసమే తినే పులుల గుండె పరిస్థితి ఏంటి? వాటికి రక్తనాళాల్లో బ్లాక్‌లు ఎందుకు ఏర్పడవు? పులుల మరణాలకు కారణమవుతున్న ఆ గుండె వైఫల్యం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పులికి హార్ట్ ఎటాక్ వస్తుందా..? సైన్స్ చెప్పే ఈ నిజాలు 99శాతం మందికి తెలియదు..
Do Tigers Get Heart Attacks

Updated on: Aug 23, 2026 | 11:06 AM

ఈ మధ్యకాలంలో మనుషుల్లో గుండెపోట్లు కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు పెద్దవాళ్లకే పరిమితమైన ఈ సైలెంట్ కిల్లర్.. ఇప్పుడు యువతను సైతం బలితీసుకుంటుంది. అయితే మనలాగే జంతువులకు కూడా హార్ట్ ఎటాక్ వస్తుందా?.. ప్రధానంగా అడవిలో తిరుగులేని బలం, వేగంతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించే పులులు కూడా గుండెపోటుతో మరణిస్తాయా అనే సందేహం అందరిలో ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం అవుననే అంటున్నారు వన్యప్రాణి నిపుణులు. జూలలో లేదా అభయారణ్యాల్లో పులులు అకస్మాత్తుగా మరణించినప్పుడు పోస్ట్‌మార్టం నివేదికల్లో హార్ట్ ఎటాక్ అని పేర్కొనడం మనం చూస్తుంటాం. అయితే మనషులలో వచ్చే గుండెపోటుకు, పులులలో సంభవించే గుండె వైఫల్యానికి మధ్య శరీర నిర్మాణపరంగా చాలా స్పష్టమైన తేడాలు ఉన్నాయి.

కొలెస్ట్రాల్ వల్ల కాదు..

మనుషులలో గుండెపోటు ప్రధానంగా ఎథెరోస్క్లెరోసిస్ అనే ప్రక్రియ వల్ల వస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల గుండె కండరాలు దెబ్బతింటాయి. కానీ మాంసాహారులైన పులుల శరీర తత్వం సహజంగానే అధిక కొవ్వు, కొలెస్ట్రాల్‌ను తట్టుకునేలా నిర్మితమై ఉంటుంది. అందువల్ల వాటి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరి బ్లాక్‌లు ఏర్పడే అవకాశం దాదాపు ఉండదు. వీటికి వచ్చే సమస్య గుండె కండరాలు బలహీనపడటం లేదా రక్తనాళాలు గట్టిపడటం వల్ల తలెత్తుతుంది. పులులలో గుండె వైఫల్యం రావడానికి జన్యుపరమైన లోపాలు ఒక ప్రధాన కారణం. సంరక్షణ కేంద్రాల్లోని పులులలో, ప్రధానంగా తెల్ల పులులలో ఇన్‌బ్రీడింగ్ కారణంగా కార్డియోమయోపతి వంటి వంశపారంపర్య గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. దీనివల్ల వయసుతో సంబంధం లేకుండానే గుండె కండరాలు క్రమంగా తమ పనితీరును కోల్పోతాయి.

తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడి కూడా పులుల ప్రాణాలను హరిస్తుంది. విపరీతమైన భయం, గాయాలు లేదా తీవ్రమైన వేదనకు గురైనప్పుడు వాటి కార్డియోవాస్కులర్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడి గుండె అకస్మాత్తుగా ఆగిపోతుంది. అలాగే వయసు పైబడిన పులులలో మూత్రపిండాల వ్యాధులు లేదా ఇతర అవయవాలు క్షీణించినప్పుడు దాని పర్యవసానంగా గుండె వైఫల్యం సంభవిస్తుంది. చికిత్స సమయంలో వాడే మత్తుమందుల ప్రభావం కూడా కొన్నిసార్లు పులుల గుండెకు ముప్పుగా మారుతుంది. మత్తు ఇచ్చినప్పుడు శ్వాస, గుండె స్పందనల వేగం మందగిస్తుంది. అప్పటికే బలహీనంగా ఉన్న లేదా వృద్ధాప్యంలో ఉన్న పులుల శరీరం ఈ ప్రభావాన్ని తట్టుకోలేక హృదయ స్పందన శాశ్వతంగా ఆగిపోయే ప్రమాదం ఉంది.

మొత్తంగా చూస్తేజ.. మనుషుల తరహాలో జీవనశైలి, ఆహారపు కొవ్వుల వల్ల పులులకు గుండెపోటు రాదు. కానీ జన్యు లోపాలు, వయసు, తీవ్రమైన ఒత్తిడి వల్ల వాటి గుండె సైతం అకస్మాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us