ఒక్క మహిళ.. 55 సూట్‌కేసులు.. తనిఖీల్లో తెరిచి చూసిన అధికారులకు భారీ షాక్!

ప్రయాణాలంటే ఎవరైనా ఒకటి లేదా రెండు సూటు కేసులు వెంట తీసుకెళ్తారు. కానీ ఓ మహిళ ఏకంగా 55 సూట్ కేసులతో ప్రయాణిస్తుంది. అలా దేశం బోర్డర్ వద్ద వ్యాన్ లో వెళ్తున్న మహిళను పోలీసులు ఆపి తనిఖీ చేయగా.. దాదాపు అధికారులు అందరికీ దిమ్మ తిరిగింది..

ఒక్క మహిళ.. 55 సూట్‌కేసులు.. తనిఖీల్లో తెరిచి చూసిన అధికారులకు భారీ షాక్!
Swiss Woman 55 Suitcases Travel Incident

Updated on: Jun 02, 2026 | 8:56 PM

సాధారణంగా ప్రయాణికులు ఒకటి లేదా రెండు సూట్‌కేసులతో ప్రయాణిస్తుంటారు. కానీ ఓ స్విస్ మహిళ ఏకంగా 55 సూట్‌కేసులు, బ్యాగులతో వాన్‌లో ప్రయాణించింది. జర్మనీ-స్విట్జర్లాండ్ సరిహద్దు వద్ద కస్టమ్స్ అధికారులు సదరు మహిళ లగేజీ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. సరిహద్దు తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు ఆ సూట్ కేసులను ఓపెన్‌ చేయగా.. లోపల ఉన్నవి చూసి అవాక్కయ్యారు. ఈ ఘటన స్విట్జర్లాండ్‌లోని షాఫ్‌హౌసెన్ కాంటన్ పరిధిలో ఉన్న థాయింగెన్ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద చోటుచేసుకుంది.

జర్మనీకి చెందిన బీటింగెన్ పట్టణం నుంచి స్విట్జర్లాండ్‌లోకి ప్రవేశిస్తున్న వాన్‌ను సరిహద్దు వద్ద అధికారులు తనిఖీ చేశారు. వ్యాన్‌లో భారీ సంఖ్యలో లగేజీ ఉండటాన్ని అధికారులు గుర్తించారు. మొత్తం 55 సూట్‌కేసులు, బ్యాగులు ఉండటంతో వాటిలో ఏవైనా అక్రమ వస్తువులు, నిషేధిత సరుకులు ఉండొచ్చనే అనుమానంతో వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఫెడరల్ ఆఫీస్ ఫర్ కస్టమ్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ (BAZG) సిబ్బంది ప్రత్యేక మొబైల్ ఎక్స్‌రే యంత్రాన్ని ఉపయోగించి ప్రతి సూట్‌కేసును విడివిడిగా పరిశీలించారు. విమానాశ్రయాల్లో లగేజీ తనిఖీ చేసే విధంగానే ఈ ప్రక్రియను నిర్వహించారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ తనిఖీలో అధికారులు ప్రతి బ్యాగ్‌ను పరిశీలించారు.

అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ 55 సూట్‌కేసుల్లో ఎలాంటి అక్రమ వస్తువులు, స్మగ్లింగ్ సరుకులు, నిషేధిత వస్తువులు లేవని తేలింది. వాటిలో కేవలం వ్యక్తిగత వస్తువులు మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ వస్తువులు విదేశాల్లో కొనుగోలు చేసినవి కాకపోవడంతో కస్టమ్స్ క్లియరెన్స్ అవసరం కూడా లేకపోయింది. ఈ మహిళ ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతకాలం పర్యటన చేసింది? ఎందుకు ఇన్ని సూట్‌కేసులతో ప్రయాణిస్తుంది? అనే విషయాలు మాత్రం అధికారులకు ఎంత ఆలోచించినా మిస్టరీగానే మిగిలిపోయింది. తనిఖీల్లో ఎలాంటి నేరం గుర్తించకపోవడంతో అధికారులకు ఆమెను వదిలేయక తప్పలేదు. అయితే ఒకే వ్యక్తి ఇంత భారీ లగేజీతో ప్రయాణించడం అరుదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లను సైతం నోరెళ్లబెడుతున్నారు.

Follow Us