
కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్ రంగంలో రోజురోజుకూ సరికొత్త అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. యంత్రాలు మానవ సామర్థ్యాలకు మాత్రమే పరిమితం కాకుండా, అంతకుమించిన శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ యునిట్రీ తాజాగా ఆవిష్కరించిన సూపర్‌మ్యాన్ అనే హ్యూమనాయిడ్ రోబోట్ ఇందుకు నిదర్శనంగా నిలిచింది.
చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ యునిట్రీ అత్యంత వినూత్నమైన సూపర్‌మ్యాన్ హ్యూమనాయిడ్ రోబోట్‌ను ఆవిష్కరించింది. యునిట్రీ సంస్థ విడుదల చేసిన అధికారిక ప్రకటన, వీడియో ప్రకారం, ఈ సూపర్‌మ్యాన్ రోబోట్ నిలబడిన చోటు నుంచే ఏకంగా 2 మీటర్ల ఎత్తుకు ఎగరగలదు. అంతేకాకుండా, ఇది సెకనుకు 12.66 మీటర్ల గరిష్ట వేగంతో పరిగెత్తగలదు. ఈ అసాధారణ వేగం ప్రపంచ రికార్డులను సైతం సవాలు చేస్తోంది. 100 మీటర్ల పరుగుపందెం దిగ్గజం ఉసేన్ బోల్ట్ సాధించిన గరిష్ట వేగం సెకనుకు 12.42 మీటర్లు కాగా, ఈ రోబోట్ అంతకంటే ఎక్కువ వేగాన్ని నమోదు చేయడం గమనార్హం. అలాగే సాధారణ మానవుల జంపింగ్ సామర్థ్యం కంటే ఇది చాలారెట్లు ఎక్కువ ఎత్తుకు ఎగురుతుంది.
ఈ హ్యూమనాయిడ్ రోబోట్ కాళ్ల పొడవు కేవలం 0.85 మీటర్లు మాత్రమే. అయినప్పటికీ ఇంతటి భారీ మోటార్ శక్తిని, బ్యాలెన్స్‌ను ప్రదర్శించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. యునిట్రీ డెవలపర్లు ఈ ప్రాజెక్ట్‌ను కేవలం 3 నెలలకు పైగా వ్యవధిలోనే సిద్ధం చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో దీని అల్గారిథమ్స్, హార్డ్‌వేర్‌ను మరింత మెరుగుపరిస్తే ఈ వేగం ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Unitree New Robot Preview: “Superman” Breaking the Limits of Humanity🥳
Standing high jump 2 m, top speed 12.66 m/s (0.85 m leg length)
Surpassing the standing high jump and running speed records of all humans around the world
This new machine has only been in development for a… pic.twitter.com/12i80ITU6p— Unitree (@UnitreeRobotics) August 17, 2026
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రోబోట్ వీడియో సాంకేతిక ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మానవ పరిధులను దాటి వేగంగా స్పందించే ఇలాంటి హై-స్పీడ్ హ్యూమనాయిడ్ రోబోట్‌లు రాబోయే రోజుల్లో అత్యవసర సహాయక చర్యలు, ప్రమాదకర ప్రాంతాల్లో పరిశోధనలు, రక్షణ రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని నిపుణులు భావిస్తున్నారు.