అర్థరాత్రి బైక్‌లపై వచ్చి.. చేపలతో ఎర వేసి .. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్

రాత్రి వేళ.. బైక్‌లపై చిన్న చిన్న గుంపులుగా వస్తారు. ఇళ్ల బయట మాటు వేసి చూస్తారు. పిల్లి కనిపించగానే చేప ముక్కలతో ఎర వేస్తారు. అది బోనులోకి రాగానే ఎత్తుకెళ్లిపోతారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 2,700 పిల్లులను దొంగిలించి విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మందిని వియత్నాంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

అర్థరాత్రి బైక్‌లపై వచ్చి.. చేపలతో ఎర వేసి .. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్
Cat Trafficking In Vietnam

Updated on: Oct 06, 2026 | 4:20 AM

నిందితులు రాత్రి సమయంలో మోటార్‌బైక్‌లపై నివాస ప్రాంతాల్లో తిరుగుతారు. ఇళ్లలో పిల్లులు ఉన్నట్లు ముందే గుర్తించి.. చేప ముక్కలను ఎరగా వేసి ఉచ్చులు ఏర్పాటు చేస్తారు. పిల్లులు ఆ ఎరకు ఆకర్షితులై ఉచ్చుల్లో చిక్కుకున్న తర్వాత వాటిని తీసుకెళ్లి విక్రయిస్తారు. ఒక్కో బృందం రాత్రికి సగటున 4 నుంచి 10 పిల్లుల వరకు పట్టుకుంటుంది.  వియత్నాంలో పోలీసుల దర్యాప్తులో ఈ వ్యవహారం బయటపడింది.  55 పిల్లుల ఉచ్చులు, 2 బరువు కొలిచే యంత్రాలు, 2 వెంట్రుకలు తొలగించే యంత్రాలను  స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో షాకింగ్ విషయం

పోలీసుల విచారణలో 2,700 పిల్లులను దొంగిలించినట్లు  12 మంది నేరాన్ని ఒప్పుకున్నారు. పిల్లులను ఆహారం కోసం చంపేందుకు తరలిస్తున్నట్లు చెప్పారు. రక్షించిన 13 పిల్లులను వాటి యజమానులకు అప్పగించారు. మిగిలిన పిల్లులను ‘హేవ్‌ పాజ్’ అనే జంతు  కేంద్రంలో సంరక్షించారు.

వియత్నాంలో పిల్లి మాంసం చట్టబద్ధం

వియత్నాంలో కుక్క, పిల్లి మాంసాన్ని ఎక్కువగా తింటారు. పిల్లి మాంసం విక్రయం, వినియోగం చట్టబద్ధం అయినప్పటికీ.. జంతువుల మూలాలను తెలిపే అనుమతులు విక్రేతల వద్ద ఉండటం తప్పనిసరి. జంతు సంరక్షణ సంస్థ హ్యూమేన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ అంచనా ప్రకారం.. వియత్నాంలో ప్రతి ఏడాది 50 లక్షల కుక్కలు, 10 లక్షల పిల్లులను అక్రమంగా తరలించి, మాంసం కోసం హతమార్చుతున్నారు.

మారుతున్న ప్రజల ఆలోచన

అయితే పిల్లి, కుక్క మాంసం విక్రయం విషయంలో వియత్నాంలో ప్రజల ఆలోచన క్రమంగా మారుతోందని జంతు సంరక్షణ కార్యకర్తలు చెబుతున్నారు. సర్వేలో 71 శాతం మంది పిల్లి మాంసం వినియోగం, విక్రయంపై నిషేధానికి మద్దతు తెలిపారు. ముఖ్యంగా యువత, పెంపుడు జంతువులను పెంచుకునే వారిలో వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లు సర్వే లో తెలిసింది.  పిల్లులను దొంగిలించి మాంసం కోసం తరలిస్తున్నారనే ఆరోపణలతో జూన్‌లో ఓ ముఠాను అధికారులు పట్టుకున్నారు. ఆ సమయంలో 400కు పైగా పిల్లులను రక్షించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us