క్షణాల్లో 50 వాహనాలు ఢీ! 6 లేన్లపై వాహనాల కుప్పలు.. బల్గేరియాలో 11 మంది మృతి!

బల్గేరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై దట్టమైన పొగమంచుతో ఎదురుగా ఏ వాహనం వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇంతలో ఓ బస్సు, ట్రక్కు ఒక్కసారిగా ఢీకొన్నాయి. ఆ తర్వాత పరిణామాలు భయానకంగా మారాయి. వెనుక వస్తున్న వాహనాలు బ్రేకులు వేసేలోపే ఒకదానికొకటి బలంగా ఢీకొట్టాయి. కార్లు, లారీలు, బస్సులు ఇలా వరుసగా ప్రమాదంలో చిక్కుకున్నాయి. కొన్ని వాహనాలు నుజ్జునుజ్జు కాగా మరికొన్ని బోల్తా పడ్డాయి. ఆరు లేన్ల రహదారి క్షణాల్లోనే వాహనాల శిథిలాలతో నిండిపోయింది. సుమారు 50 వాహనాలు చిక్కుకున్న ఈ భీకర ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 50 మంది గాయపడ్డారు.

క్షణాల్లో 50 వాహనాలు ఢీ! 6 లేన్లపై వాహనాల కుప్పలు.. బల్గేరియాలో 11 మంది మృతి!
Bulgaria Horror 50 Vehicles Collide In Foggy Highway Pile Up 11 Killed 50 Injured

Updated on: Nov 10, 2026 | 10:27 PM

తూర్పు బల్గేరియాలోని యాంబోల్ నగరం సమీపంలో ప్రమాదం జరిగింది. రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉండటంతో వాహనదారులకు ముందున్న వాహనాలు సరిగా కనిపించలేదు. బర్గాస్ వైపు వెళ్లే మార్గంలో ముందుగా ఓ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి.  వెనుక వస్తున్న వాహనాలు ఒక్కసారిగా అదుపు తప్పాయి. ఒకదాని వెనుక మరొకటి ఢీకొంటూ భారీ ప్రమాదానికి దారితీశాయి. రహదారికి ఇరువైపులా ప్రయాణిస్తున్న కార్లు, ట్రక్కులు  ప్రమాదంలో చిక్కుకున్నాయి.  దాదాపు 50 వాహనాలు దెబ్బతిన్నాయి.

ఆరు లేన్లపై వాహనాల కుప్పలు.. భయానక దృశ్యాలు!

ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. స్థానిక మీడియా ప్రసారం చేసిన దృశ్యాల్లో కార్లు, ట్రక్కులు ఒకదానిపై మరొకటి పడి ఉండటం కనిపించింది. కొన్ని వాహనాలు రోడ్డుపక్కకు దూసుకెళ్లగా మరికొన్ని పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఇంకొన్ని వాహనాలు బోల్తా పడి తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని వాహనాలు కాలిపోయాయి. ఈ ప్రమాదానికి దట్టమైన పొగమంచు కారణమని బల్గేరియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి ల్యూబోమిర్ నికోలోవ్  తెలిపారు.

వాహనాల్లోనే చిక్కుకున్న బాధితులు

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వాహనాల శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన సుమారు 50 మందిని సమీప నగరాల్లోని ఆసుపత్రులకు తరలించారు. కొంతమంది ఇంకా తమ వాహనాల్లోనే చిక్కుకున్నారు.

ఘటనపై బల్గేరియా ప్రధానమంత్రి రుమెన్ రాదేవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను తరలించేందుకు వైద్య బృందాలు, స్ట్రెచర్లతో కూడిన రెండు విమానాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రమాదం తీవ్రత దృష్ట్యా తన మిగిలిన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్న ప్రధాని ఘటనా స్థలాన్ని సందర్శించారు.

యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలి పర్యటన కుదింపు

ఈ ఘోర ప్రమాదం యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ పర్యటనపైనా ప్రభావం చూపింది. బల్గేరియా ప్రధానితో సమావేశం కోసం ఆమె ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులను కాపాడేందుకు శ్రమిస్తున్న సహాయక బృందాలకు అభినందనలు తెలిపారు. ఈ విషాదం నేపథ్యంలో తన పర్యటనను ముందుగానే ముగించారు.

బల్గేరియాలో అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు!

బల్గేరియాలో రోడ్డు ప్రమాదాల సమస్య కొత్తదేమీ కాదు. యూరోపియన్ యూనియన్‌లో రోడ్డు ప్రమాద మరణాల రేటు అత్యధికంగా ఉన్న దేశాల్లో బల్గేరియా ముందుంది. యూరోపియన్ కమిషన్ గణాంకాల ప్రకారం 2025లో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 71 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇది యూరోపియన్ యూనియన్‌లోనే అత్యధిక రేటు.

2025లో ఆ దేశంలో మొత్తం 456 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగం, సరిగ్గా లేని రహదారులు, పాత వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. బల్గేరియాలో రిజిస్టర్ అయిన కార్లలో  దాదాపు సగం 20 ఏళ్లకు పైబడినవేనని సమాచారం.

రోడ్డు ప్రమాద మరణాలు, తీవ్ర గాయాల సంఖ్యను 2030 నాటికి 50 శాతం తగ్గించాలని యూరోపియన్ యూనియన్ లక్ష్యంగా పెట్టుకుంది. అయినప్పటికీ బల్గేరియా, రొమేనియా దేశాల్లో ప్రమాదాల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పొగమంచు కారణంగా జరిగిన ఈ భారీ ప్రమాదం రహదారులపై భద్రత, వాహనదారుల అప్రమత్తతను  మరోసారి గుర్తుచేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us