
పేదరికం తాండవిస్తున్న ఆఫ్ఘనిస్థాన్‌లో నలుగురు భార్యలు, 58 మంది పిల్లలతో మహమ్మద్ సాదెక్ పడుతున్న పాట్లపై బీబీసీ తాజాగా కథనం ప్రసారం చేసింది. వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు పిల్లలకు కనీస అవసరాలు అందకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ‘ఒక్క వీడియోలో ఇన్ని మానవ హక్కుల ఉల్లంఘనలా?’ అంటూ ప్రశ్నించాడు.
భార్యలకి పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితిలో మహమ్మద్ సాదెక్ తన బాధ్యతను సరిగ్గా నెరవేర్చలేకపోయానని అంగీకరించాడు. పిల్లలను పోషించడం ఎంత కష్టమో ముందే తెలిసి ఉంటే, ఇంత మందికి తండ్రిని అయ్యేవాడిని కాదని చెప్పాడు. అయితే, కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పిల్లలను కనడం ఎందుకు కొనసాగించాడనే ప్రశ్నకు అతడు స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయాడు.
సాదెక్ తెలిపిన వివరాల ప్రకారం.. అతని నలుగురు భార్యలకూ చిన్న వయసులోనే వివాహాలు జరిగాయి. తన పిల్లల్లో కొందరు మరణించడానికి, అప్పట్లో వారి తల్లులకు చిన్నారులను ఎలా చూసుకోవాలో, ఎలా పాలివ్వాలో సరైన అవగాహన లేకపోవడం కారణం. చిన్న వయసులో గర్భం దాల్చడం, ప్రసవం తర్వాత శిశువులను చూసుకోవడంలో తగిన సహాయం అందకపోవడంతో తల్లులు, పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడిందనీ ముఖ్యంగా వైద్య సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రమైందనీ చెప్పుకొచ్చాడు.
అర్థాకలితో పిల్లలు నిద్రపోతారనీ, వారికి చెప్పులు కొనిచ్చే స్తోమత తనకు లేదని సాదెక్ తెలిపాడు. తలుపులు, కిటికీలు లేని మట్టి ఇంట్లో, అడ్డుగా కట్టిన పలుచటి తెరలే గోడలుగా . పొయ్యి ఉన్నా ఇంధనం, కట్టెలు కొనలేని పరిస్థితి, కాగితాలతో మంటను రాజేసే దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేక ఇబ్బంది పడుతున్నాడు సాదెక్.
కార్ల విక్రయ కేంద్రంలో పనిచేస్తున్న మహమ్మద్ సాదెక్ కి కారు అమ్మినప్పుడు 1,000 ఆఫ్ఘానీలు లభిస్తాయి. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1,469. ఈ కొద్దిపాటి ఆదాయమే కుటుంబానికి ఆధారం. నలుగురు భార్యలు, 58 మంది పిల్లలున్న పెద్ద కుటుంబానికి ఆహారం, దుస్తులు, ఇతర నిత్యావసరాలు సమకూర్చడం అతనికి కష్టంగా మారింది. కారు అమ్మకాలు జరిగినప్పుడే ఆదాయం వస్తుండటంతో కుటుంబ ఖర్చులను భరించడం మరింత భారమవుతోంది. అతని ఆఖరి సంతానం వయసు కేవలం మూడు నెలలు.
బీబీసీ గ్లోబల్ ఉమెన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మహమ్మద్ సాదెక్ కుటుంబానికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. వీడియో చూసిన నెటిజన్లు కుటుంబ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు కనీస అవసరాలు అందకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే బాలికలకు పెళ్లిళ్లు చేయడం, తల్లులుగా మారాల్సిన పరిస్థితులు కల్పించడం పై ప్రశ్నలు లేవనెత్తారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘ఒక్క వీడియోలో ఇన్ని మానవ హక్కుల ఉల్లంఘనలా’ అంటూ ప్రశ్నించాడు. మరో వ్యక్తి, ‘పిల్లలకు పాలివ్వడం, వారిని ఎలా చూసుకోవాలో కూడా తెలియనంత చిన్న వయసులో అతని భార్యలు తల్లులయ్యారనే విషయం కలచివేస్తోందనీ వారు గర్భం దాల్చినప్పుడు ఎంత చిన్న వయసులో ఉండి ఉంటారో అన్నది తీవ్ర ఆందోళన కలిగిస్తోందనీ, ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందని రాసుకొచ్చాడు.
మహమ్మద్ సాదెక్ కుటుంబ పరిస్థితి ఒక రకంగా తాలిబన్ ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతోంది. తాలిబన్ల అరాచక పాలనలో అఫ్గానిస్తాన్‌లో బాల్య వివాహాలు పెరిగాయి, బాలికలకు విద్య దూరమైంది, తల్లులు, శిశువులకు అవసరమైన వైద్య సహాయం అందడం లేదు. ఈ సమస్యల ప్రభావం ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై ఎక్కువగా పడటం విచారకరం.