
స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ యుగంలో పిల్లల చేతికి పరికరాలు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరించే విచిత్రమైన, విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. తన యూట్యూబ్ వీడియోలకు ఎక్కువ వ్యూస్ రావాలన్న తాపత్రయంతో ఓ తొమ్మిదేళ్ల బాలుడు చేసిన పనికి తండ్రి ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చింది. యూట్యూబ్ ప్రకటనల కోసం ఏకంగా రూ. కోటికి పైగా ఖర్చు చేసేశాడు. డేవ్ అనే వ్యక్తి తొమ్మిదేళ్ల కుమారుడు మైక్.. మైటీ మైక్ ప్లేస్ పేరిట ఒక గేమింగ్ యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతున్నాడు. అందులో రోబ్లాక్స్, మైన్‌క్రాఫ్ట్ వంటి ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ వీడియోలు అప్‌లోడ్ చేసేవాడు.
తన వీడియోలను ఎక్కువ మంది చూడటం లేదని ఆ బాలుడు తండ్రికి చెప్పడంతో.. ప్రమోషన్స్ ఎలా చేయాలో నేర్పించాలని డేవ్ భావించాడు. కేవలం 20 డాలర్లు బడ్జెట్ పెట్టి, టార్గెట్ ఆడియన్స్‌ను ఎలా ఎంచుకోవాలో కుమారుడికి చూపించాడు. అయితే ప్రమోషన్ కోసం ఉపయోగించిన గూగుల్ అకౌంట్‌కు డేవ్ పనిచేస్తున్న సంస్థకు చెందిన కార్పొరేట్ క్రెడిట్ కార్డు ముందే సేవ్ అయి ఉంది. అక్కడే అసలు ముప్పు మొదలైంది.
తండ్రి నేర్పించిన మెలకువను పట్టుకున్న 9 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత తండ్రికి తెలియకుండా స్వయంగా యాడ్ క్యాంపెయిన్లు ప్రారంభించాడు. డబ్బు విలువ, బిల్లింగ్ ప్రాసెస్ గురించి ఏమాత్రం అవగాహన లేని ఆ చిన్నారి.. ‘‘ఎక్కువ డబ్బు పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి’’ అనే అమాయకపు ఆలోచనతో వరసపెట్టి ప్రమోషన్లు కొట్టేశాడు. ఇలా వరుసగా మూడు వారాల పాటు ప్రకటనలు రన్ అవుతూనే ఉన్నాయి. ఆ బాలుడు ప్రమోట్ చేసిన ఒక్కో వీడియోకి దాదాపు 2 లక్షలకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. కానీ ఆ వ్యూస్ వెనుక ఎంత పెద్ద ఆర్థిక విపత్తు దాగి ఉందో ఎవరూ ఊహించలేదు.
కంపెనీ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఆడిట్ చేసినప్పుడు భారీగా అడ్వర్టైజింగ్ ఖర్చులు కనిపించడంతో యాజమాన్యం డేవ్‌ను అర్జెంట్ మీటింగ్‌కు పిలిచింది. మేనేజర్, ఫైనాన్స్ టీమ్ కలిసి సుమారు రూ. 1 కోటి బిల్లు వివరాలను ఆయన ముందు పెట్టేసరికి డేవ్ షాక్‌తో నోరెళ్లబెట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా డేవ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. కంపెనీ క్రెడిట్ కార్డు డిటెయిల్స్‌ను ఎలాంటి పరిమితులు లేదా సెక్యూరిటీ లేకుండా అకౌంట్‌లో ఉంచడం తన తప్పిదమేనని అంగీకరించాడు. ఈ సొమ్మును కంపెనీ తన జీతం నుంచి రికవరీ చేస్తుందా లేక ఉద్యోగం నుంచే తొలగిస్తుందా అనే విషయంలో తనకు ఇంకా స్పష్టత రాలేదని వాపోయాడు.
తండ్రి ఈ వీడియోను రికార్డ్ చేస్తూ.. ‘‘వీక్షకులకు నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?’’ అని కుమారుడిని అడగ్గా.. ఆ బాలుడు అమాయకంగా ‘‘ఐ యామ్ డెఫినెట్లీ కుక్డ్’’ (నేను పూర్తిగా ఇరుక్కుపోయాను) అని సమాధానమిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
తక్షణమే ఆ గూగుల్ అకౌంట్ నుంచి కార్డ్ వివరాలను తొలగించడంతో పాటు యూట్యూబ్ ఛానెల్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ కుటుంబం తెలిపింది. చిన్నారులు వాడే డివైజ్‌లలో ఆటో-పేమెంట్స్, సేవ్డ్ క్రెడిట్ కార్డులు ఉంచితే ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది.