
జర్మనీలో ఓ రోబోట్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్ బయట 16 ఏళ్ల బాలిక తన స్నేహితులతో నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ రోబోట్ యువతుల దగ్గరకు వెళ్లింది. వారిని ఆలింగనం చేసుకుంది. ఈ క్రమంలో ఓ బాలికను అసభ్యంగా తాకింది. ఇద్దరు టీనేజీ యువకులు ఈ ఘటనను సోషల్ మీడియాలో లైవ్ ప్రసారం చేసారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రోబోట్తో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
కొలోన్ నగరంలో రద్దీగా ఉండే హోహెన్జోలెర్న్రింగ్ వీధిలో ఓ ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్ బయట 16 ఏళ్ల బాలిక తన స్నేహితులతో నడుచుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో 1.2 మీటర్ల ఎత్తున్న ఎరుపు, బంగారు రంగులో ఉన్న రోబోట్ బాలిక దగ్గరకు వచ్చింది. ఆ రోబోట్ బాలిక పిరుదుల భాగాన్ని తాకి, అభ్యంతరకరమైన కదలికలు చేసింది. ఈ ఘటనను అక్కడే ఉన్న ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో లైవ్ ప్రసారం చేసారు.
రోబోట్ యజమాని అయిన 16 ఏళ్ల బాలుడితో పాటు, అతనితో ఉన్న ఓ 19 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ఘటనను లైవ్ ప్రసారం చేయడం కాకుండా, వీడియో తీస్తున్న సమయంలో కామెంట్లు కూడా చేసినట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు వోక్స్వ్యాగన్ కారు డిక్కీలో రోబోట్ కనిపించింది. రోబోట్ కదలికలను వీరిద్దరూ రిమోట్ ద్వారా నియంత్రించారా? బాలికను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ప్రోగ్రామ్ను మార్చారా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. లైంగిక వేధింపులకు సంబంధించి క్రిమినల్ కేసులు నమోదు చేసారు.