
కుటుంబ సభ్యులను రైలు ఎక్కించడానికి వెళ్లిన 12 మందికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఊహించని షాక్ తగిలింది. వారణాసి నుండి న్యూఢిల్లీ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (22415) ఆదివారం కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఈ రైలుకు ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ తర్వాత నేరుగా న్యూఢిల్లీలోనే స్టాప్ ఉంటుంది. కాన్పూర్ స్టేషన్లో తమ కుటుంబ సభ్యులు, బంధువులను సీట్ల వద్ద కూర్చోబెట్టడానికి వేర్వేరు కుటుంబాలకు చెందిన 12 మంది కోచ్ లోపలికి వెళ్లారు. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.
వీరు లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే సమయం ముగియడంతో వందే భారత్ ఆటోమేటిక్ తలుపులు వాటంతట అవే మూసుకుపోయాయి. రైలు వేగం పుంజుకోవడంతో లోపల ఉన్న 12 మంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తమను కిందకు దించాలంటూ రైలు సిబ్బందిని వేడుకున్నారు. కానీ సాంకేతిక నిబంధనల ప్రకారం, స్టాప్ లేని చోట ఆటోమేటిక్ తలుపులు తెరుచుకోవని సిబ్బంది స్పష్టం చేశారు.
లోపల చిక్కుకున్న వారి ఆందోళన ఎక్కువవడంతో రైలు సిబ్బంది వెంటనే తుండ్లా రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 10:49 గంటల సమయంలో ఇటావా జంక్షన్ వద్ద రైలును అత్యవసరంగా నిలిపివేశారు. స్టేషన్ సూపరింటెండెంట్, ఆర్పీఎఫ్ (RPF), జీఆర్పీ (GRP) పోలీసులు అక్కడికి చేరుకుని ఆ 12 మందిని సురక్షితంగా కిందకు దించారు.
టికెట్ లేకుండా రైలులోకి ప్రవేశించడం, రైల్వే నిబంధనలను ఉల్లంఘించడంపై కమర్షియల్ విభాగం అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. కాన్పూర్ నుండి ఇటావా వరకు ఉన్న 139 కిలోమీటర్ల దూరానికి ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున 12 మందికి కలిపి మొత్తం రూ.36,000 జరిమానా విధించారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం చేయవద్దని గట్టిగా హెచ్చరించి వారిని విడిచిపెట్టారు. వందే భారత్ వంటి రైళ్లలో ప్రయాణించేటప్పుడు లేదా బంధువులను సాగనంపేటప్పుడు ఆటోమేటిక్ తలుపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..