కన్నీళ్లే పాము విషానికి విరుగుడు.. ఈ జంతువు పవర్ తెలిస్తే నోరెళ్లబెడతారు..

మరణాన్ని ముంగిట నిలబెట్టే పాముకాటుకు.. కన్నీళ్లతో చెక్ పెట్టవచ్చా? అవును.. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఏటా లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న పాము విషానికి విరుగుడుగా.. ఓ మూగజీవి కన్నీళ్లు అద్భుతంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నాగుపాము, రక్తపింజరి లాంటి 26 రకాల అత్యంత ప్రమాదకరమైన పాముల విషాన్ని సైతం నిర్వీర్యం చేయగల ఆ జీవి ఏదో తెలుసా..?

కన్నీళ్లే పాము విషానికి విరుగుడు.. ఈ జంతువు పవర్ తెలిస్తే నోరెళ్లబెడతారు..
Can Camel Tears Cure Snakebite

Updated on: May 29, 2026 | 6:31 PM

ప్రకృతిలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు ముందుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ పాముకాటు వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రాణాంతక సమస్యకు అంతం పలికేందుకు ఎన్నో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే దుబాయ్, భారత్‌కు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన ఒక వినూత్న పరిశోధనలో మైండ్ బ్లోయింగ్ నిజం వెల్లడైంది. ఒంటె కన్నీళ్లు పాము విషానికి శక్తివంతమైన విరుగుడుగా పనిచేయగలవని వారు కనుగొన్నారు. దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ, దేశంలోని బికనీర్‌కు చెందిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ క్యామెల్స్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ వినూత్న అధ్యయనాన్ని చేపట్టారు. వారు ఒంటెలకు అత్యంత విషపూరితమైన స్కేలీ వైపర్ పాము విషాన్ని చాలా తక్కువ మోతాదులో ఇంజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఒంటెల రక్తాన్ని, కన్నీళ్లను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. ఈ పరీక్షల్లో ఒంటె కన్నీళ్లలో ఉండే నానోబాడీస్ అనే ప్రత్యేక యాంటీబాడీలు.. పాము విషం వల్ల కలిగే అంతర్గత రక్తస్రావం, రక్తం గడ్డకట్టే లోపాలు, నరాల బలహీనత వంటి హానికర ప్రభావాలను సమర్థవంతంగా నివారించగలవని తేలింది.

ఒక్క చుక్క కన్నీరు.. 26 జాతుల పాములకు చెక్..

ఈ పరిశోధన ప్రకారం.. ఒంటె కన్నీటిలోని ఒక్క చుక్కకు నాగుపాములు, వైపర్ల వంటి అత్యంత ప్రమాదకరమైన జాతులతో సహా దాదాపు 26 జాతుల పాముల విషాన్ని నిర్వీర్యం చేసే శక్తి ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

పాత యాంటీవెనమ్‌లతో పోలిస్తే దీనికున్న ప్రత్యేకతలు

ప్రస్తుతం గుర్రాలు, గొర్రెల రక్తం నుండి తయారుచేసే యాంటీవెనమ్‌లు చాలా ఖరీదైనవి, కొంతమందిలో అలర్జీలకు దారితీస్తాయి. పాత మందులను కచ్చితంగా రిఫ్రిజిరేటర్‌లోనే ఉంచాలి. కానీ ఒంటె కన్నీళ్ల నుండి తీసే నానోబాడీస్ సైజులో చిన్నవిగా, మరింత స్థిరంగా ఉంటూ అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలవు. వీటికి ఫ్రిజ్ అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాలకు వీటిని సులభంగా తరలించవచ్చు, పైగా ఖర్చు కూడా చాలా తక్కువ.

ఒంటెలు పెంచేవారికి ఆదాయం..

ఒకవేళ ఈ సాంకేతికత వాణిజ్యపరంగా విజయవంతమైతే, దేశంలోని రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోని ఒంటెల పెంపకందారులకు ఇది ఒక అదనపు ఆదాయ వనరుగా మారుతుంది. వారు ఒంటె కన్నీళ్లను ఫార్మా కంపెనీలకు అమ్ముకుని మంచి లాభాలు గడించే అవకాశం ఉంటుంది.

ఇది కేవలం ప్రాథమిక పరిశోధన మాత్రమే

  • ఈ ఆవిష్కరణ వినడానికి ఎంతో ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ప్రజలు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు.
  • ఒంటె కన్నీళ్లను నేరుగా తాగడం వల్ల గానీ, గాయాలపై పూయడం వల్ల గానీ పాముకాటు నయం కాదు.
  • కన్నీళ్ల నుండి ఆ ప్రత్యేక నానోబాడీలను ల్యాబ్‌లో వేరు చేసి, సైంటిఫిక్ పద్ధతిలో ఔషధంగా మార్చితేనే అది పనిచేస్తుంది.
  • ఈ మందు ఇంకా మానవులపై ప్రయోగాత్మకంగా పరీక్షించబడలేదు. ప్రభుత్వాల ఆమోదం కూడా లభించలేదు.

కాబట్టి పొరపాటున కూడా ఇలాంటి ప్రయోగాలు ఇంట్లో చేయకూడదు. పాముకాటుకు వైద్యపరంగా నిరూపించబడిన ఏకైక సురక్షితమైన చికిత్స.. వెంటనే ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ల సమక్షంలో యాంటీవెనమ్ ఇంజెక్షన్ తీసుకోవడం మాత్ర.

Follow Us