Telangana: దేవత అనుకుంటే బలి తీసుకుంది.. అయినా కరుణతో ఆ పాముని….

| Edited By: Ram Naramaneni

Jul 31, 2024 | 1:59 PM

ఏళ్ల తరబడి పూజించిన పామే.. ఆమెను బలి తీసుకుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....

Telangana: దేవత అనుకుంటే బలి తీసుకుంది.. అయినా కరుణతో ఆ పాముని....
Snake Bite
Follow us on

20 ఏళ్లు భక్తి‌శ్రద్దలతో పూజించిన వృద్దురాలు గంగవ్వను బలి తీసుకున్న పామును ఎట్టకేలకు పట్టుకున్నారు స్నేక్ క్యాచర్స్. పుట్టలో దాక్కున్న నాగుపామును బందించారు స్నేక్ క్యాచర్స్. ఆ పామును చూసేందుకు ఆ ఊరు ఊరంతా కదిలొచ్చింది. ఆ పామును చంపేయాలంటూ ముక్తకంఠంతో నినదించింది. కానీ ఆ వృద్దురాలి కన్నకూతురు దయ తలచడంతో ఆ పాముకు ప్రాణబిక్ష దక్కింది.

నిర్మల్ జిల్లా ఖా‌నాపూర్ మండలంలోని గోసంపల్లిలో రిటైర్డ్ ఆయా గంగవ్వను బలి తీసుకున్న నాగు పామును స్నేక్ క్యాచర్స్ బందించారు. గంగవ్వ కూతురు పద్మ నిర్ణయంతో ఆ పామును బందించిన స్నేక్ క్యాచర్స్ సమీప అటవిలో క్షేమంగా వదిలేశారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన అలుగుల గంగవ్వ(65) కు ఓ కుమారుడు రాజ లింగు, కుమార్తే పద్మ ఉన్నారు. ముప్పై ఏళ్లకు పైగా అంగన్‌వాడీలో ఆయాగా విధులు నిర్వహించిన గంగవ్వ ఈనెల 1 న పదవి విరమణ పొందింది‌. 20 ఏళ్లుగా ఇంట్లోనే పుట్ట ఉండటంతో నిత్యం శుద్ది చేసి పూజలు చేస్తూ వచ్చేది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం కూడా నిద్ర లేవగానే ఇంటి పనుల్లో భాగంగా పుట్ట చుట్టూ మట్టి నేలను అలుకుతుండగా అకస్మాత్తుగా పుట్టలో నుంచి బయటకు వచ్చిన నాగుపాము చేతిపై కాటు వేసింది. దైవంగా పూజించిన పాము కాటేయడంతో తనకేం కాదని.. అంతా శివయ్యే చూసుకుంటాడని మళ్లీ పనుల్లో మునిగి పోయింది. కొద్దిసేపటికే మరోసారి బయటకొచ్చిన పాము వంట పనిలో మునిగిపోయిన గంగవ్వను మరొసారి కాటేసింది. పదే పదే పాము కాటేయడంతో అనుమానపడ్డ గంగవ్వ.. కళ్లు తిరుగుతున్నాయంటూ చుట్టు పక్కల వాళ్లకు సమాచారం ఇచ్చింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. బందువుల సాయంతో గంగవ్వను నాటు వైద్యం కోసం లింగాపూర్ కు తరలించారు… కానీ అప్పటికే పరిస్థితి విషమించిందని వైద్యం చేయడానికి నాటు వైద్యుడు నిరాకరించడంతో.. హుటాహుటిన ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బందువులు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. పాము కాటుకు గంగవ్వ బలైంది. ఆ వృద్దురాలును బలి తీసుకున్న ఆ నాగుపాము మాత్రం ఆ పుట్టను వదలకపోవడంతో ఆ పుట్టపై వలను కప్పి ఆ పామును బందించారు స్థానికులు‌. 24 గంటల అనంతరం కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆ పాముకు ఎలాంటి హాని జరగకుండా బందించి సమీపంలో అడవిలో వదిలేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..