MLC By-Election: అగ్ర నేతల పోటాపోటీ ప్రచారం.. హీటెక్కుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సమరం..!

| Edited By: Balaraju Goud

May 22, 2024 | 8:52 AM

తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా, మరో ఎన్నికకు సిద్ధమయ్యారు ఓటర్లు. వరంగల్ -ఖమ్మం -నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీటెక్కిస్తోంది. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరెత్తుతోంది.

MLC By-Election: అగ్ర నేతల పోటాపోటీ ప్రచారం.. హీటెక్కుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సమరం..!
Theenmar Mallanna Premandar Reddy Rakesh Reddy
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా, మరో ఎన్నికకు సిద్ధమయ్యారు ఓటర్లు. వరంగల్ -ఖమ్మం -నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీటెక్కిస్తోంది. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరెత్తుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్‌ఎస్‌, ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్‌ పట్టుదలతో వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లోనూ బలమైన ఓట్లు సాధించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ప్రచారానికి ఇంకా మూడు రోజులే గడువు ఉండడంతో అభ్యర్థుల తరపున కీలక నేతలు రంగంలోకి దిగారు.

ప్రచార రంగంలోకి అగ్ర నేతలు..

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 52మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకే్‌షరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గస్థాయిల్లో పట్టభద్రుల సమావేశాలు నిర్వహించారు. మార్నింగ్‌ వాక్‌లు, సోషల్‌ మీడియా, టీవీ ఛానళ్లతో పాటు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారాన్ని ఉధృతం చేశారు.

ప్రచారానికి మూడు రోజులు గడువు మాత్రమే ఉండడంతో అభ్యర్థులతో పాటు వారి తరపున కీలక నేతలు కాంగ్రెస్ తరపున రాష్ట్ర మంత్రులు, బిజెపి తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీష్ రావు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారాన్ని ఉదృతం చేశారు. మరోవైపున తెరవెనక తమ బలం, బలగాన్ని ఉపయోగించి పట్టభద్రుల ఓట్లు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

పాగా వేసేందుకు కాంగ్రెస్…

గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఈ స్థానంలో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్నను పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించింది. తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ఉమ్మడి జిల్లాల మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్క తోపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గస్థాయి పట్టభద్రుల సదస్సులను నిర్వహించారు మేధావి వర్గం, విద్యావంతులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు మల్లన్నను గెలిపించాలని కోరుతున్నారు. ఈ ఎన్నికల్లోనూ గెలిచి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుచుకుని తన ఆధిపత్యాన్ని చాటాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో తమ గెలుపు సులభమని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.

సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్…

పట్టభద్రుల నియోజక వర్గం ఏర్పాటైనప్పటినుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికలోనూ సీటును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రంగంలోకి దిగారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కీలక నేతలను ఇన్ చార్జీలుగా పార్టీ అధిష్టానం నియమించింది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ స్థానం నుంచి రెండు పర్యాయాలు పోటీచేయడంతో ఆయనకున్న విస్తృత సంబంధాలు, అనుభవం ఇక్కడ అభ్యర్థికి దోహదపడుతాయని భావిస్తున్నారు. ఈ సీటును దక్కించుకోవడం ద్వారా ప్రశ్నించే ప్రతిపక్షంగా తాము పనిచేస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.

పట్టభద్రుల్లోనూ బలమైన ఓటు బ్యాంకు కోసం బీజేపీ…

పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును గెలవాలనే లక్ష్యంతో బీజేపీ అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగారు. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి గెలుపునకు శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడిందని, పార్లమెంటు ఎన్నికల్లో తమదే పైచేయిగా చెబుతున్న బీజేపీ.. పట్టభద్రుల ఆదరణ కూడా తమకే ఉందని నిరూపించే సంకల్పంతో కాషాయం నేతలు ప్రయత్నిస్తున్నారు. గ్రాడ్యుయేట్స్‌ను తమ వైపు తిప్పుకునేందుకు కిషన్‌రెడ్డి.. వరంగల్, యాదాద్రి జిల్లాలో ప్రచారం చేశారు. ప్రత్యర్థులకంటే మెరుగ్గా పోరాడి మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించాలనే పట్టుదలతో బీజేపీ నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. పట్టభద్రులస్థానంలో తమ అభ్యర్థి ప్రేమేందర్‌ను గెలిపించాలని కోరుతున్నారు.

ఈ ఉపఎన్నిక మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో పోరు ఆసక్తికరంగా మారింది. పోలింగ్ తేదీ సమీపిస్తుందడంతో అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…