Telangana: పెద్దపులి కలకలం.. గోశాలలో ఆవుపై దాడి.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్!

వికారాబాద్ జిల్లాలోని బసిరెడ్డిపల్లిలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. కృష్ణగిరి క్షేత్ర గోశాలలో ఆవులపై దాడి చేయగా, ఒక ఆవు మృతి చెందింది. సీసీ కెమెరాల్లో పులి కదలికలు నమోదయ్యాయి. స్థానికుల్లో భయాందోళన నెలకొంది. గోశాల సంరక్షకులు పులిని పట్టి తరలించాలని, ఆవులకు రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి.

Telangana: పెద్దపులి కలకలం.. గోశాలలో ఆవుపై దాడి.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్!
Vikarabad Tiger

Updated on: Sep 27, 2026 | 11:43 AM

వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం స్థానికంగా భయాందోళనకు కారణమైంది. కృష్ణగిరి క్షేత్ర ఆలయ పరిధిలోని గోశాలలో పులి ఆవులపై దాడి చేసినట్లు గోశాల సంరక్షకులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం ఓ లేగదూడను పులి ఎత్తుకెళ్లినట్లు పేర్కొంటున్నారు.

తాజాగా మరో ఆవుపై పులి దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో గోశాల సంరక్షకుడు పులి కదలికలను గమనించడంతో అది అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. పులి దాడిలో ఆవు మెడ, ఉదర భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వీపుపై పంజా ఆనవాళ్లు కూడా కనిపించాయి. తీవ్ర గాయాలతో ఆవు మృతి చెందినట్లు గోశాల నిర్వాహకులు తెలిపారు.

అదే సమయంలో సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌కు చెందిన సీసీ కెమెరాల్లో పులి కదలికలు రికార్డ్ అయ్యాయి. దీంతో పులి సంచారంపై స్థానికుల్లో మరింత ఆందోళన నెలకొంది. గోశాలలో సుమారు 200 వరకు ఆవులు ఉన్నాయని సంరక్షకుడు కృష్ణస్వామి తెలిపారు. పులిని గుర్తించి బంధించి, దానిని మరో అటవీ ప్రాంతంలోకి తరలించాలని ఆయన అధికారులను కోరారు. గోశాలలోని ఆవులకు రక్షణ కల్పించేందుకు అటవీశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పులి సంచారంతో బసిరెడ్డిపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.

పులి సంచారం వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us