
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దసరా పండుగ సమయంలో జానపద కళాకారులు వివిధ వేషధారణలో ఇళ్లకు వస్తూ, హాస్యం కోసం నమ్మశక్యం కాని కల్లబొల్లి కబుర్లు, భారీ గొప్పలు చెప్తుంటారని.. రాహుల్ కూడా సేమ్ టు సేమ్ అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ చేసే నిరాధారమైన, విడ్డూరమైన ఆరోపణలు వింటుంటే ఆయన ఎంతో హాస్యాస్పదమైన, నమ్మలేని కట్టుకథలు అల్లుతున్నారని అర్థమవుతోందని కిషన్ రెడ్డి అన్నారు.
ప్రధాని మోదీ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన తాజా ఆరోపణ అత్యంత విడ్డూరంగా, వింతగా ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు రాహుల్ గాంధీకి ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయని, ఆయన అంతులేని ఊహాశక్తికి మూలం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి ముందు, ఆ సమయంలో ఇందిరా గాంధీ అనుసరించిన కఠిన వైఖరిని, విచ్చలవిడిగా జరిపిన ఫోన్ ట్యాపింగ్‌ల గురించి ఆమె గొప్పగా చెప్పుకున్న విషయాలే రాహుల్ గాంధీకి ఇలాంటి ఆలోచనలకు ప్రేరణ అయి ఉండవచ్చని కిషన్ రెడ్డి తన పోస్టులో విమర్శించారు. నాటి ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు ఆధారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.