Farm Laws Repealed: ఇది రైతుల విజయం.. కేసీఆర్‌ సెగ ఢిల్లీ వరకు వస్తుందనే ఈ ప్రకటన.. మంత్రి నిరంజన్‌రెడ్డి..

|

Nov 19, 2021 | 12:45 PM

కేంద్ర ప్రభుత్వం మూడు రైతు చట్టాలను వెనక్కు తీసుకోవడం హర్షణీయమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

Farm Laws Repealed: ఇది రైతుల విజయం.. కేసీఆర్‌ సెగ ఢిల్లీ వరకు వస్తుందనే ఈ ప్రకటన.. మంత్రి నిరంజన్‌రెడ్డి..
Follow us on

కేంద్ర ప్రభుత్వం మూడు రైతు చట్టాలను వెనక్కు తీసుకోవడం హర్షణీయమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ఎందరో రైతుల ప్రాణాలు దక్కేవని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. కేంద్రం నిర్ణయంతో రైతులు ఎదురుచూస్తున్న ఫలితం వచ్చిందని, ఈ పోరాటంలో అమరులైన రైతుల కుటుంబాల బాధ్యతలను కేంద్రమే తీసుకోవాలని నిరంజన్‌ రెడ్డి కోరారు. ‘ కేంద్రం ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకుందని మేం అనుకోవడం లేదు. రైతు చట్టాల వల్ల బీజేపీ ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందనే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు క్షమాపణ చెప్పిన మోడీ గొప్ప మనసును మేం అంగీకరిస్తున్నాం. అయితే సాగు చట్టాలు ఉపసంహరించుకున్నంత మాత్రాన కేంద్రంపై టీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదు. రైతులకు పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకు కేసీఆర్ ఉద్యమం చేస్తూనే ఉంటారు. రైతు చట్టాల మాదిరిగానే విద్యుత్ చట్టాలను కూడా మోడీ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకోవాలి’ అని మంత్రి డిమాండ్‌ చేశారు.

కేంద్రంపై మా  పోరాటం ఆగదు..
మోడీ ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కు తీసుకోవడం రైతుల విజయమని మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘ అన్నదాతలకు అండగా కేసీఆర్‌ చేపట్టిన మహా ధర్నాను మోడీ ప్రభుత్వం గ్రహించింది. గత నెల రోజుల నుంచి మా ప్రభుత్వం వివిధ పద్ధతుల్లో రైతుల సమస్యలపై పోరాటం చేస్తోంది. కేసీఆర్ నాయకత్వం రైతులకు దొరుకుతుందన్న భయమే ప్రధాని ప్రకటన అని మేం భావిస్తున్నాం. రైతు ఉద్యమాలకు సరైన కేంద్ర బిందువు లేకనే ఇన్ని రోజులు సాగిందనుకుంటున్నాం. కేసీఆర్ మహాధర్నా సెగ ఢిల్లీ వరకు చేరుతుందనే ప్రధాని ఈ ప్రకటన చేశారు. వడ్ల కొనుగోళ్లపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు మా పోరాటం ఆగదు. దేశంలో ఇంకా ఆకలి కేకలు ఉన్నాయని సుప్రీం కోర్టు చెప్తోంది. బాయిల్డ్ రైస్ కేవలం అన్నం తినడానికి మాత్రమే కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయి. తెలంగాణలో అతి ఎక్కువ విస్తారంలో వరి పండుతుంది. స్టాక్స్ ఎక్కువైనంత మాత్రాన పంటను కొనుగోలు చేయరా? పోనీ కనీసం ప్రత్యామ్నాయ ఆలోచనైనా చేయాలి కదా?. అలా చేయకపోతే అధికార పీఠం నుంచి కేంద్రం వైదొలగాలి. కేంద్రం సమగ్ర వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలి. దేశంలో సాగవుతోన్న వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సాహకాలు ప్రకటించాలి. అదేవిధంగా శాంతకుమారి కమిటీ నివేదికలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పంటల కాలనీలను ఏర్పాటు చేయాలి’ అని మంత్రి పేర్కొన్నారు.

Also Read:

Farm Laws Repealed: ఇది అన్నదాతలు సాధించిన విజయం.. తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలు

PM Modi Live: మోదీ సంచలన నిర్ణయం.. రైతు చట్టాలు వెనక్కి తీసుకొని.. రైతులకు క్షమాపణ.. (వీడియో)

అయినా రైతుల ఆందోళనలు ఆగవు.. అప్పటి వరకు కొనసాగిస్తాం: రాకేష్ తికాయత్ ప్రకటన