Telangana: ఆస్తి కోసం ఆగిపోయిన అంత్యక్రియలు.. మూడు రోజులుగా మార్చురీలోనే మృతదేహం..!

| Edited By: Balaraju Goud

Jun 11, 2024 | 8:27 PM

ఆస్తులు, కేసులతో చివరికి రక్త సంబంధాలు కూడా చిద్రమవుతున్నాయి. తండ్రి ఆస్తి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు చెల్లెళ్లు, ఆ కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని భార్య భీష్మించుకుంది. దీంతో మూడు రోజులుగా మృతదేహం మార్చురీలోనే మగ్గుతోంది.

Telangana: ఆస్తి కోసం ఆగిపోయిన అంత్యక్రియలు..  మూడు రోజులుగా మార్చురీలోనే మృతదేహం..!
Selfi Suicide
Follow us on

మారుతున్న కాలం తోపాటు మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. మనిషి అంతిమ సంస్కారాలకు కూడా ఆస్తి గోడవలే అడ్డుగోడలుగా మారుతున్నాయి. ఆస్తులు, కేసులతో చివరికి రక్త సంబంధాలు కూడా చిద్రమవుతున్నాయి. తండ్రి ఆస్తి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు చెల్లెళ్లు, ఆ కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని భార్య భీష్మించుకుంది. దీంతో మూడు రోజులుగా మృతదేహం మార్చురీలోనే మగ్గుతోంది.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి చెందిన చీరిక హనుమంతరెడ్డి(48) హైదరాబాద్‌లో ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డి పోస్ట్‌మాస్టర్‌గా ఉద్యోగ విరమణ చేసిన నర్సిరెడ్డి.. మూడేళ్ల క్రితం సూసైడ్ చేసుకున్నారు. నర్సిరెడ్డి పేరిట 7.24 ఎకరాల భూమి ఉంది. తండ్రి నర్సిరెడ్డి ఆస్తిలో తమకూ వాటా కావాలని హనుమంత రెడ్డి తోబుట్టువులైన ఇద్దరు చెల్లెళ్లు కోర్టుకెక్కారు. మరోవైపు తమ్ముడు కరుణాకర్‌రెడ్డితోనూ హనుమంతరెడ్డికి ఆస్తి తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా ఇద్దరు చెల్లెళ్ళు, సోదరుడితో హనుమంత రెడ్డికి ఆస్తి తగాదాలు ఎక్కువయ్యాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన హనుమంత రెడ్డి స్వగ్రామం పంతంగికి వచ్చి సెల్ఫీ వీడియో తీసుకుని, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే, తన భర్త మృతికి ఆడపడుచులు, మరిదే కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసు కేసుతో భయపడిన ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు కరుణకర్ రెడ్డి.. కేసును ఉపసంహరించుకోవాలని బంధువులు, గ్రామ పెద్దల ద్వారా హనుమంతరెడ్డి భార్య స్వప్నపై ఒత్తిడి తెచ్చారు. ఆస్తి విషయమై కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటేనే.. పోలీస్ కేసు ఉపసంహరించుకుని అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య స్వప్న, ఆమె బంధువులు మొండికేశారు. దీంతో మూడు రోజులుగా హనుమంత రెడ్డి మృతదేహం చౌటుప్పల్ మార్చురీలో మగ్గుతోంది. కోర్టు కేసు ఉపసంహరణకు సోదరుడు, చెల్లెళ్లతో బంధువులు చర్చిస్తున్నారు. కోర్టు సమయంలోపు ఒప్పించి, కేసు ఉపసంహరించుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..