Telangana: యూవర్ అటెన్షన్ ప్లీజ్.. ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్‌డేట్.. చెల్లించకపోతే ఇక దబిది దిబిడే.!

తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై కఠిన నిబంధనలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ ఆర్సీ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆ వివరాలు ఇలా..

Telangana: యూవర్ అటెన్షన్ ప్లీజ్.. ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్‌డేట్.. చెల్లించకపోతే ఇక దబిది దిబిడే.!
Telangana Traffic Police

Updated on: Mar 20, 2026 | 8:10 AM

తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు, వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది. రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటు, నిబంధనలను ఉల్లంఘించే వాహనదారుల్లో బాధ్యతను పెంచేందుకు రవాణా శాఖ కఠినమైన ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ను సిద్ధం చేసింది. ఒక వాహనంపై ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే, ఆ సమాచారం నేరుగా రవాణా శాఖకు చేరుతుంది. వెంటనే సదరు వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్(DL) లేదా వాహన ఆర్సీ(RC)ని అధికారులు బ్లాక్ చేయవచ్చు. లైసెన్స్ లేదా ఆర్సీ బ్లాక్ అయిన పక్షంలో, పెండింగ్ చలాన్లన్నీ చెల్లించే వరకు ఎటువంటి ఆర్టీఏ(RTA) సేవలు పొందే అవకాశం ఉండదు. కెమెరా ఆధారిత చలాన్లను 3 రోజుల్లోగా, మాన్యువల్ చలాన్లను 15 రోజుల్లోగా వాహనదారులకు పంపాల్సి ఉంటుంది. చలానా అందిన 45 రోజుల్లోపు జరిమానా చెల్లించాలి లేదా అభ్యంతరాన్ని దాఖలు చేయాలి.

ఫిర్యాదుల కోసం ‘గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీ’:

చలాన్లపై వచ్చే అభ్యంతరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీ’ని ఏర్పాటు చేయనుంది. సాంకేతిక లోపాలు లేదా వాహనం విక్రయించిన తర్వాత వచ్చే తప్పుడు చలాన్ల లాంటి సమస్యలను వాహనదారులు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే నమోదు చేయాల్సి ఉంటుంది. అధికారులు ఫిర్యాదు అందిన 30 రోజుల్లోపు నిర్ణయాన్ని వెల్లడిస్తారు. అధికారుల నిర్ణయంతో ఏకీభవించని పక్షంలో, చలాన్ మొత్తంలో 50 శాతం చెల్లించి కోర్టును ఆశ్రయించే వెసులుబాటు కూడా కల్పించారు. ఈ కొత్త విధానం ద్వారా కేంద్ర మోటార్ వాహన నిబంధనల అమలులో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రాధమిక నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో రవాణా శాఖ వర్గాల నుంచి వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us