Telangana: సన్న వడ్లకు రూ.500 బోనస్ పథకం.. తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్.. వారికి మాత్రమే డబ్బులు..

తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ప్రకటిస్తోంది. అయితే ఈ పథకంలో పలు కీలక మార్పులు చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి 7 రకాల విత్తన రకాలకు మాత్రమే బోనస్ జమ చేయనుంది.

Telangana: సన్న వడ్లకు రూ.500 బోనస్ పథకం.. తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్.. వారికి మాత్రమే డబ్బులు..
Farmers

Updated on: Jul 06, 2026 | 9:18 PM

రైతులు పండించిన సన్న వడ్లకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ అందిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతులు విక్రయించిన సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేస్తోంది. వీటిని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం వేస్తోంది. అయితే ఈ పథకానికి సంబంధించి రేవంత్ సర్కార్ కీలక మార్పులు చేసింది. బోనస్ అందించేందుకు పలు విధివిధానాలు మార్చింది. ప్రస్తుతం జరుగుతున్న వానాకాలం సీజన్‌కు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక నుంచి ప్రభుత్వం ప్రకటించిన 7 రకాల సన్న రకం విత్తనాలు వేసి పండించిన రైతులకు మాత్రం బోనస్ అందుతుంది.

ఇక నుంచి కొత్తగా..

సన్న వడ్లకు బోనస్ విషయంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 2026 వానాకాలంకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన 7 రకాల వరి పంటలకు మాత్రమే బోనస్ అందిస్తారు. విత్తనాలను నమోదు చేసేందుకు ఆన్ లైన్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. విత్తన డీలర్లు తాము విక్రయించిన వరి రకం విత్తనాలను వెబ్‌సైట్లో పొందుపర్చాల్సి ఉంటుంది. https://seedsgrowerp.com/seedsales/login.php పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ వెబ్‌సైట్ ద్వారా డీలర్లు విత్తనాలను నమోదు చేయాల్సి ఉంటుంది. డీలర్లు క్యూఆర్ కోడ్ ద్వారా ఈ పోర్టల్‌లోకి సులువుగా లాగిన్ అవ్వొచ్చు. సన్న వరి రకం విక్రయాల ఆప్షన్‌ను ఎంచుకుని విత్తనాలు కొనుగోలు చేసిన రైతు పేరు, తండ్రి పేరు, విత్తన రకం, కంపెనీ పేరు, లాట్ నంబర్, సీడ్ ప్యాకెట్ సైజ్, కొనుగోలు చేసిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

ఈ సీజన్‌కు మాత్రమే..

2026 వానాకాలం సీజన్‌లో విక్రయించే విత్తనాలకు మాత్రమే ఈ డిజిటల్ విధానం అమల్లో ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిక గడువు లేదీలోగా విత్తన డీలర్లు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ర్‌ఎన్‌ఆర్–15048, బీపీటీ–5204, కేఎన్‌ఎం–1638, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, డబ్ల్యుజీఎల్–44, కేఎన్‌ఎం–7715 రకాలు పండించిన రైతులకు మాత్రమే బోనస్ అందిస్తారు. ఆన్ లైన్ రికార్డుల్లో నమోదు అయినా రైతులకు మాత్రమే బోనస్ జమ చేశారు. ఇక విత్తన డీలర్ల వద్ద కాకుండా సొంతగా విత్తనాలను భద్రపర్చుకుని సాగు చేసే రైతులు తమ మండల పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలి. ఇక వ్యవసాయ శాఖ యాప్‌లో రైతులు స్వయంగా తమ విత్తన రకం వివరాలను నమోదు చేసుకోవచ్చు. బోనస్ జమలో అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Follow Us