Bandi Sanjay: చేతనైతే వడ్లు కొను.. లేదంటే గద్దె దిగు.. కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించిన బండి సంజయ్

|

Apr 11, 2022 | 5:29 PM

తెలంగాణలో పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీలో ధర్నా చేపడుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

Bandi Sanjay: చేతనైతే వడ్లు కొను.. లేదంటే గద్దె దిగు.. కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించిన బండి సంజయ్
Bandi Sanjay
Follow us on

Bandi Sanjay Comments:  తెలంగాణ(Telangana)లో పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) ఢిల్లీలో ధర్నా(Delhi Dharna) చేపడుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. రాష్ట్రంలో ఏం చేయలేకే.. దేశ రాజధానికి వెళ్లారని మండిపడ్డారు. కేసీఆర్‌ దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలనే డిమాండ్‌తో బీజేపీ శ్రేణులు సోమవారం ఇందిరాపార్క్‌ వద్ద ‘వడ్లు కొను.. లేదా గద్దె దిగు’ అనే నినాదంతో చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే ముఖ్యమంత్రి ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలన్నారు. ఏ రాష్ట్రంలో లేని సమస్యను సీఎం కేసీఆర్ ఇక్కడ సృష్టించారని విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు టీఆర్ఎస్‌ను వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. దొరల గడీల పాలనను త్వరలో కూల్చుతామని బండి సంజయ్‌ హెచ్చరించారు.

వడ్ల కొనుగోలు వ్యవహారం బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నా చేస్తే, హైదరాబాద్‌ లో బీజేపీ దీక్షలతో తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. యాసంగి వడ్లు కొనేదాకా కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న బండి సంజయ్.. తప్పు కేసీఆర్ చేసి.. కేంద్రాన్ని బదనాం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఓట్లు, సీట్లు కొంటవ్.. రైతుల కోసం వడ్లు కొనలేవా? దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలో ఇప్పుడే ఎందుకొచ్చింది? పంట చేతికొస్తున్న సమయంలో రైతులను అరిగోస పెడతావా? అంటూ సూటిగా ప్రశ్నించారు. మోదీని గద్దె దించే దమ్ముందా కేసీఆర్.. రైతును రాజు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న గొప్ప నాయకుడు నరేంద్రమోదీ. ఒక్కో ఎకరానికి 65 వేలకుపైగా ఖర్చు చేస్తున్న ఘనత మోదీ సర్కార్‌దే. మోదీ పాలనలోనే పత్తి, మిర్చిసహా పంట ఉత్పత్తులకు అధికంగా గిట్టుబాటు ధర లభిస్తోంది నిజం కాదా? అని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంచి ప్రజలపై కేసీఆర్ భారం వేసిండు.. ఛార్జీలను చూసి జనం భగ్గుమంటున్నరు. కాబట్టే చర్చను దారి మళ్లించేందుకే ఈ డ్రామాలు అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బియ్యం కొనేది మేమే.. పైసలు చెల్లించేది కేంద్రమే. ఇన్నాళ్లు నేనే కొంటున్నా, కేంద్రానికి సంబంధం లేదని 7 ఏళ్లుగా ప్రజలను వంచించినవ్ కదా.. మరెందుకు కొనడం లేదో చెప్పాలన్నారు. వడ్లను పక్కా కొనేది కేంద్రమే. రాష్ట్రం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందన్నారు. డబ్బులు ఇచ్చేది కేంద్రమే. అన్ని రాష్ట్రాలతో కేంద్రం జూమ్ సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని రాష్ట్రాలు యాసంగి పంట ధాన్యం వివరాలు వెల్లడిస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆ వివరాలు ఇవ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. ధాన్యం ఇవ్వబోమని, కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తున్నామని రైతులను మోసం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.