పోటెత్తుతున్న కృష్ణమ్మ.. శ్రీశైలం వైపు వరద పరుగులు.. జూరాల గేట్లు ఎత్తివేతతో జలకళ!

రెండు నెలలుగా వర్షాభావ పరిస్థితులతో ఆందోళనలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు ఎట్టకేలకు ఊరట లభిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో ఆలస్యమైన వర్షాలు ఇప్పుడు కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో జోరందుకున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ప్రారంభమైంది. దీంతో రైతులు, సాగునీటి వర్గాలు ఆశావహంగా ఎదురుచూస్తున్నాయి.

పోటెత్తుతున్న కృష్ణమ్మ.. శ్రీశైలం వైపు వరద పరుగులు.. జూరాల గేట్లు ఎత్తివేతతో జలకళ!
Jurala Project

Updated on: Jul 31, 2026 | 8:05 AM

రెండు నెలలుగా వర్షాభావ పరిస్థితులతో ఆందోళనలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు ఎట్టకేలకు ఊరట లభిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో ఆలస్యమైన వర్షాలు ఇప్పుడు కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో జోరందుకున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ప్రారంభమైంది. దీంతో రైతులు, సాగునీటి వర్గాలు ఆశావహంగా ఎదురుచూస్తున్నాయి.

మహారాష్ట్ర, కర్ణాటకలోని పశ్చిమ కనుమల ప్రాంతాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం జూరాలకు సుమారు 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, అధికారులు క్రస్ట్ గేట్లు ఎత్తి దాదాపు 30,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద జలాలన్నీ వేగంగా శ్రీశైలం జలాశయానికి చేరుతున్నాయి.

ఇక కృష్ణా నదిపై ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 80 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 89,520 క్యూసెక్కుల ప్రవాహం జూరాలకు చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 18,349 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 823.70 అడుగులుగా నమోదైంది. రానున్న నాలుగు రోజుల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు కూడా వరద నీరు చేరుతుండటంతో జలాశయాలు క్రమంగా నిండుతున్నాయి. దీంతో సాగునీరు, తాగునీటి అవసరాలపై ఉన్న ఆందోళన కొంత మేర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు భారీగా వరద నీరు చేరుతుండటంతో ఆ అందాలను తిలకించేందుకు పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు, నది దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us