Governor’s quota MLC: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

|

Aug 14, 2024 | 2:02 PM

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను నామినేట్ చేశారు. అయితే.. ఆ లిస్ట్‌ను గవర్నర్ తిరస్కరించడంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు.

Governors quota MLC: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court
Follow us on

తెలంగాణ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను నామినేట్ చేశారు. అయితే.. ఆ లిస్ట్‌ను గవర్నర్ తిరస్కరించడంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు.

ఈ కేసు కోర్టులో ఉండగానే.. కొత్తగా కోదండరామ్‌, అమీర్ అలీఖాన్‌లను నామినేట్ చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. కొత్త పేర్లకు గవర్నర్‌ కూడా ఆమోదముద్ర వేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో, కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించొద్దని ఆదేశాలిచ్చింది హైకోర్టు.

దాసోజు శ్రవణ్‌, కూర సత్యనారాయణ ఎన్నికను పునఃపరిశీలించాలని సూచించింది తెలంగాణ హైకోర్టు. అదే టైమ్‌లో కోదండరామ్, అమీర్‌ అలీఖాన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను కొట్టేసింది. దాసోజు శ్రవణ్‌, కూర సత్యనారాయణ నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్‌కు లేదన్న హైకోర్టు.. ఫైల్‌ను కేబినెట్‌కు తిప్పిపంపాలే గాని తిరస్కరించకూడదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపైనే ఇప్పుడు స్టే విధించింది సుప్రీంకోర్టు.

కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే… ప్రభుత్వం, గవర్నర్‌ హక్కులను హరించినట్టు అవుతుందని వ్యాఖ్యానించింది సుప్రీం. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వం విధి అని పేర్కొంది. అయితే, కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలన్న పిటిషనర్‌ తరపు న్యాయవాది విజ్ఞప్తిని తోసిపుచ్చింది సుప్రీం. గవర్నర్‌ నిర్ణయాన్ని తాము అడ్డుకోలేమని చెప్పింది.

కేసు విచారణను నాలుగు వారాలు వాయిదా వేసిన సుప్రీం.. ప్రతివాదులుగా ఉన్న గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీల నియామకంలో ఏ చర్యలు తీసుకున్నా తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని తేల్చిచెప్పింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..