
పాములు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి.. చాలా పాములు విషం కలిగినవి.. కొన్ని పాములకు విషం ఉండదు.. ఇన్‌లాండ్ తైపాన్, బ్రౌన్ స్నేక్, కింగ్ కోబ్రా, రక్తపింజర, కట్లపాము లాంటి పాములు కాటేస్తే చాలా ప్రమాదం. వెంటనే చికిత్స పొందకపోతే నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి.. వెంటనే ఆసుపత్రికి వెళ్లడం ద్వారా 99% బతికే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. పాము కాటుకు గురైనప్పుడు సరైన చర్యలు తీసుకోవడం ప్రాణాలను కాపాడుకోవచ్చు.. వాస్తవానికి భారతదేశంలో పాము కాటు మరణాలు గణనీయమైన ఆరోగ్య సమస్యగా మారాయి. చాలా ప్రాంతాల్లో మరణాల సంఖ్య పెరిగినట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ముఖ్యంగా వర్షాకాలంలో పాములు తమ ఆవాసాల నుండి బయటకు వచ్చి మానవ నివాస ప్రాంతాలలో సంచరిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు పాము కాటుకు ఎక్కువగా గురవుతుంటారు. అంతేకాకుండా, గ్రామాలకు దూరంగా ఉండే హాస్టళ్లు, గురుకులాల్లో నివసించే విద్యార్థులకు కూడా విషపూరిత సర్పాలతో ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ మధ్య కాలంలో గురుకులాల్లో పాము కాటు కేసులు తరచూ నమోదవుతున్నాయి. చాలా మంది పాము కాటుకు గురైన తర్వాత సరైన ప్రథమ చికిత్స పద్ధతులు తెలియక లేదా సొంత ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో, పాము కాటుకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ కాటు వేసిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయాలు తెలుసుకోవడం అత్యవసరం.
పాము కరిచిన వెంటనే మొదటి ముఖ్యమైన పని అది విష సర్పమా కాదా అని గుర్తించడం. సాధారణంగా, విషం లేని పాముల తల గుండ్రంగా ఉంటుంది. అదే విషపూరిత పాముల తల త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ ప్రాథమిక నిర్ధారణ భయాన్ని తగ్గించి, తదుపరి చర్యలకు తోడ్పడుతుంది. ఒకవేళ విషపూరిత పాము కరిచిందని నిర్ధారించినా, భయపడకుండా ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించాలి. బాధితుడు ఎంత ప్రశాంతంగా ఉంటే, విషం శరీరంలోకి వేగంగా వ్యాపించే అవకాశం అంత తక్కువగా ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గడం వల్ల విషం నెమ్మదిగా ప్రసరిస్తుంది.
పాము కాటు వేసిన ప్రాంతంలో బిగుతుగా ఉండే దుస్తులను, ఆభరణాలను వెంటనే తొలగించాలి. ఇది కాటు వేసిన ప్రదేశంలో వాపు వస్తే మరింత ఇబ్బంది కలగకుండా చేస్తుంది. కాటు వేసిన చోటు నుంచి కాస్త పైభాగంలో (గుండె వైపు) శుభ్రమైన గుడ్డతో లేదా కట్టుతో కట్టాలి. అయితే, ఈ కట్టు రక్త ప్రసరణను పూర్తిగా ఆపేయకుండా చూసుకోవాలి. ఇది పాము విషం శరీరంలో వేగంగా వ్యాపించకుండా కొంతవరకు నిరోధించడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు. గట్టిగా కట్టడం వల్ల రక్త ప్రసరణ నిలిచిపోయి కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉంది.
పాము కాటు వేసిన గాయాన్ని కోయడం లేదా నోటితో పీల్చడం వంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల గాయం మరింత ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉంది. నోటి ద్వారా విషాన్ని పీల్చడానికి ప్రయత్నించడం పీల్చే వ్యక్తికి కూడా ప్రమాదకరం కావచ్చు. అలాగే, మంత్రాలు, తంత్రాలంటూ సమయాన్ని వృథా చేయకూడదు. ఇది అమూల్యమైన చికిత్స సమయాన్ని కోల్పోవడానికి దారితీస్తుంది.
పాము కాటుకు గురైన తర్వాత వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లడం అత్యంత ముఖ్యమైన చర్య. ఎంత త్వరగా వైద్య సహాయం అందితే, బాధితుడి ప్రాణాలను కాపాడే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. సరైన యాంటీ-వెనం చికిత్స ద్వారా 99% మంది పాము కాటు బాధితులు ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు. ఆసుపత్రికి తరలించేటప్పుడు, కాటు వేసిన భాగాన్ని కదలకుండా స్థిరంగా ఉంచాలి. ఇది విషం శరీరంలో వ్యాపించే వేగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ విషయాలను గుర్తించడం, వెంటనే ఆసుపత్రికి వెళ్లడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.