తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి ప్రారంభమైంది. డిసెంబర్ 27వ తేదీన సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వాహణ కోసం రంగం సిద్ధమైంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ నెలలో జరగాల్సిన ఈ ఎన్నికలు, అనేక తర్జనభర్జనల మధ్య కోర్టు ఆదేశాల మేరకు వాయిదా పడ్డాయి.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన సింగరేణి ఎన్నికలను డిసెంబర్ 27న నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. గుర్తుల కేటాయింపు కూడా జరిగిన నేపథ్యంలో తాజాగా డిప్యూటీ CLC, సింగరేణి కార్మిక సంఘాలకు ఓటర్ల జాబితాను అందజేశారు. కార్మిక శాఖ సమర్పించిన జాబితా ప్రకారం సంస్థ వ్యాప్తంగా మొత్తం 39,832 మంది ఓటర్లు ఉండగా, ఓటర్ల జాబితాపై డిసెంబర్ ఆరవ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఎనిమిదో తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
మొత్తం మీద ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించిన 13 కార్మిక సంఘాలు, ఇక ప్రచారంపై దృష్టి సారించనున్నాయి. కార్మికులను ప్రసన్నం చేసుకోవడం కోసం వ్యూహరచనల్లో నిమగ్నమయ్యాయి. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్ ప్రాంత వ్యాప్తంగా గల 11 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం, ఆ పార్టీ అనుబంధ INTUC శ్రేణులకు నూతన ఉత్తేజాన్ని కల్పించింది. సింగరేణి ఎన్నికల్లో సైతం పై చేయి సాధించేందుకు INTUC సీరియస్ గా ప్రయత్నాలను మొదలుపెట్టింది. సంస్థలో బలంగా ఉన్న AITUC కూడా సింగరేణి ఎన్నికల్లో విజయం కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ ల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో సింగరేణి ఎన్నికల్లో AITUC – INTUC యూనియన్ల మధ్య కూడా అవగాహన కుదురుతుందా..? లేదంటే ఎవరికి వారుగా పోటీ చేస్తారా..? అనే అంశాలపై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.
ఇక గత ఎన్నికల్లో విజయం సాధించి గుర్తింపు సంఘంగా వ్యవహరించిన BRS అనుబంధ TBGKS వ్యవహారం ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో సింగరేణి ఎన్నికలు TBGKS కు ఎలాంటి ఫలితాలను అందిస్తాయోనన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంకంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…