Telangana: సిరిసిల్ల అధికారుల అదిరిపోయే ఐడియా.. డ్రోన్‌తో విద్యుత్ వైర్లు ఎలా లాగారో వీడియోలో చూడండి..

విద్యుత్ వైర్లు లాగడానికి నీటిలోకి దిగాల్సిన పనిలేదు.. ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరమూ లేదు.. ఆధునిక సాంకేతికతను ఒడిసిపట్టిన విద్యుత్ శాఖ అధికారులు సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లోతైన నీటి కుంట మీదుగా డ్రోన్ సాయంతో 11 కేవీ విద్యుత్ తీగలను సురక్షితంగా తరలించి ఔరా అనిపించారు.

Telangana: సిరిసిల్ల అధికారుల అదిరిపోయే ఐడియా.. డ్రోన్‌తో విద్యుత్ వైర్లు ఎలా లాగారో వీడియోలో చూడండి..
Drone Technology In Electricity Department

Updated on: Aug 23, 2026 | 1:06 PM

విద్యుత్ రంగంలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ అధికారులు ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా కష్టతరమైన, ప్రాణాపాయం ఉండే పనులను సైతం ఆధునిక టెక్నాలజీతో అత్యంత సులువుగా, సురక్షితంగా పూర్తి చేయవచ్చని నిరూపించారు. సిబ్బంది ప్రాణాలను రిస్క్‌లో పెట్టకుండా డ్రోన్ సాయంతో నీటి కుంట మీదుగా విద్యుత్ తీగలను అవతలి గట్టుకు చేర్చి లైన్ ఏర్పాటు పనులను విజయవంతంగా పూర్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల పరిధిలోని మల్లప్పకుంట ప్రాంతంలో కొత్తగా 11 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటు పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఒక విద్యుత్ స్తంభం నుంచి మరో స్తంభానికి లైన్ లాగాల్సి వచ్చింది. అయితే రెండు స్తంభాల మధ్య భారీగా నీటితో నిండిన కుంట ఉండటంతో పనులు ముందుకు సాగలేదు. నీటి లోతు ఎక్కువగా ఉండటంతో సిబ్బంది నీటిలోకి దిగి వైర్లను లాగడం అత్యంత ప్రమాదకరంగా మారింది.

రంగంలోకి డ్రోన్.. 200 మీటర్ల ప్రయోగం సక్సెస్

సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకున్న విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించి డ్రోన్‌ను రంగంలోకి దించారు. విద్యుత్ తీగను డ్రోన్‌కు పటిష్టంగా అనుసంధానించారు. నీటిపై నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న అవతలి గట్టుపై గల విద్యుత్ స్తంభం వద్దకు డ్రోన్ ద్వారా తీగను సురక్షితంగా తరలించారు. అనంతరం సిబ్బంది చెరువు కట్ట మీదుగా అవతలి వైపునకు చేరుకుని, వైరును స్తంభానికి బిగించి లైన్ నిర్మాణాన్ని పూర్తి చేశారు.

ప్రశంసల జల్లు

సిబ్బంది నీటిలోకి దిగాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా డ్రోన్ సాయంతో ఈ క్లిష్టమైన పనిని పూర్తి చేయడం అందరినీ ఆకట్టుకుంది. విద్యుత్ నిర్వహణ పనుల్లో ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా సమయం ఆదా అవ్వడమే కాకుండా సిబ్బందికి పూర్తి రక్షణ లభిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కష్టతరమైన ప్రదేశాల్లో పనుల కోసం మరిన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగిస్తామని తెలిపారు.

వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us