నాలుగు రోజుల జ్వరమే ప్రాణాలు తీసింది.. డెంగీతో 15 ఏళ్ల బాలుడి మృతి!

నాగర్‌కర్నూల్‌లో 15 ఏళ్ల యశ్వంత్ డెంగీతో మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. తెలంగాణలో డెంగీ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఒకే ఒక్క కుమారుడు దూరం కావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పారిశుద్ధ్యం, దోమల నియంత్రణ చర్యలు పాటించడం ద్వారా డెంగీ వ్యాప్తిని అరికట్టాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

నాలుగు రోజుల జ్వరమే ప్రాణాలు తీసింది.. డెంగీతో 15 ఏళ్ల బాలుడి మృతి!
Nagarkurnool Dengue Tragedy

Updated on: Sep 30, 2026 | 8:49 AM

తెలంగాణలో డెంగీ కేసుల నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. డెంగీతో 15 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మంగళవారం (సెప్టెంబర్ 29) వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఈశ్వర్‌కాలనీకి చెందిన ప్రభాకర్, నాగరాణి దంపతుల ఏకైక కుమారుడు యశ్వంత్ (15) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

నాలుగు రోజుల క్రితం యశ్వంత్‌కు జ్వరం రావడంతో హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు అతడిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి యశ్వంత్ మృతి చెందాడు. డెంగీ కారణంగానే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు.

యశ్వంత్ తండ్రి ప్రభాకర్ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి నాగరాణి నాగర్‌కర్నూల్ మండలంలోని శ్రీపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఎంతో ఆశగా పెంచుకున్న ఏకైక కుమారుడు అనారోగ్యంతో అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాలుడి మృతితో స్థానికంగా కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇటీవల తెలంగాణలో జ్వరాలు, డెంగీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో యశ్వంత్ మృతి స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, దోమల నియంత్రణ చర్యలపై ప్రజలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us