
ఐదు రోజుల పాటు ముచ్చింతల్ శ్రీరామనగరంలో సాగిన యతీంద్ర సప్తతి వేడుకలు.. చివరిరోజు శ్రీకోదండ రామచంద్ర స్వామివారికి నిర్వహించిన ఏకోత్తర సహస్ర కలశాభిషేకంతో పరిపూర్ణతను సంతరించుకున్నాయి. వేదమంత్రాల నడుమ.. 1,001 కలశాల పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. భక్తి సంప్రదాయానికి, వైదిక సంస్కృతికి అద్దంపట్టిన ఈ మహత్తర క్రతువుతో ఐదు రోజుల ఉత్సవాలకు మంగళకరమైన ముగింపు లభించింది. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామివారి చేతుల మీదుగా తిరుప్పావై పుస్తకావిష్కరణ జరిగింది. గోదాదేవి భక్తి తత్త్వాన్ని, తిరుప్పావైలోని ఆధ్యాత్మిక సందేశాన్ని మరింతమందికి చేరువ చేసే మరో ప్రయత్నంగా ఈ ఆవిష్కరణ నిలిచింది.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి 70వ తిరు నక్షత్ర మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆచార్యుల జన్మదిన వేడుక.. కేవలం ఉత్సవంగా మాత్రమే కాదు.. సమాజానికి ఒక సందేశంగా, సేవకు ఒక గుర్తింపుగా, ఆధ్యాత్మికతకు ఒక వేదికగా రూపుదిద్దుకుంది.
ఈ సందర్భంగా 1993లో శ్రీరామచంద్ర స్వామివారి విగ్రహాలు అదృశ్యమైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు స్వామీజీ. అయితే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు తిరిగి ఆశ్రమానికి చేరడంలో కీలక సహకారం అందించిన అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు సేవలను చిన్న జీయర్ స్వామివారు కృతజ్ఞతతో స్మరించుకున్నారు. ఆయన చేతుల మీదుగానే 32 ఏళ్లుగా ప్రతి ఏకొత్తర సహస్ర కలశాభిషేక మహోత్సవం జరుగుతున్న విషయాన్ని పంచుకున్నారు.
భక్తికి అక్షర రూపం.. ఆరాధనకు ఆధ్యాత్మిక పరిమళం తిరుప్పావై. గోదాదేవి రచించిన ఈ దివ్య పాశురాలు భగవంతుడి పట్ల శరణాగతి భావాన్ని, భక్తి తత్త్వాన్ని చాటిచెబుతాయి. అలాంటి పవిత్ర తిరుప్పావై పుస్తకాన్ని చివరి రోజు వేడుకల్లో శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారు ఆవిష్కరించారు. భక్తి సారాన్ని భావితరాలకు చేరువ చేసే మరో ఆధ్యాత్మిక ప్రయత్నమిది.
ఇలా ఐదు రోజుల పాటు సాగిన యతీంద్ర సప్తతి.. ఒక జన్మదిన మహోత్సవాన్ని మించి ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక సందేశాలను అందించింది. భగవంతుడి ఆరాధనలో భక్తి.. గురువుల బోధనలో జ్ఞానం.. సమాజ సేవలో మానవత్వం.. ఈ మూడింటి సమన్వయమే ఈ వేడుకల అంతరార్థంగా నిలిచింది.