Komatireddy: రాజీనామా లేఖను సోనియాకు పంపిన రాజగోపాల్‌రెడ్డి.. పరోక్షంగా రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు..

|

Aug 04, 2022 | 8:54 PM

Komatireddy Rajgopal Reddy: రాజీనామా చేశారు రాజగోపాల్‌రెడ్డి. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాకు పంపారు. ఎమ్మెల్యే పదవికి మాత్రం ఇంకా రాజీనామా చేయలేదు. సోనియాకు రాసిన లేఖలోనూ పరోక్షంగా రేవంత్‌ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు రాజగోపాల్‌రెడ్డి.

Komatireddy: రాజీనామా లేఖను సోనియాకు పంపిన రాజగోపాల్‌రెడ్డి.. పరోక్షంగా రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు..
Komatireddy Rajgopal Reddy
Follow us on

అన్నట్లుగానే రాజీనామా చేశారు రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopal Reddy). రాజీనామా లేఖను(Resignation Letter ) పార్టీ అధ్యక్షురాలు సోనియాకు(Sonia Gandhi) పంపారు. ఎమ్మెల్యే పదవికి మాత్రం ఇంకా రాజీనామా చేయలేదు. సోనియాకు రాసిన లేఖలోనూ పరోక్షంగా రేవంత్‌ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు రాజగోపాల్‌రెడ్డి. మరోవైపు మునుగోడు రేపు సభ పెట్టి అక్కడి నుంచే ఉప ఎన్నిక సమర శంఖాన్ని పూరించబోతోంది కాంగ్రెస్‌. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నట్లుగానే కాంగ్రెస్‌కు రాంరాం చెప్పేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోనియాకు లేఖ రాశారు. పార్టీలో తనకు ఎదురైన అనుభవాలను, రాజీనామాకు దారితీసిన పరిస్థితులను క్లుప్తంగా చెప్పారు రాజగోపాల్‌రెడ్డి. 30 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, కానీ కాంగ్రెస్‌కు విధేయులైన వారిని అవమానిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పార్టీ ద్రోహులకు అధ్యక్షురాలిపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వారికి కీలక బాధ్యతలు అప్పగించడం తీవ్రంగా బాధించిందన్నారు. ప్రజాప్రతినిధిగా చేయకూడని పనులు చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో తాను పని చేయలేనన్నారు రాజగోపాల్‌రెడ్డి. ఎమ్మెల్యేలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపలేని వారు, పోరాట కార్యాచరణ రూపొందించలేక పార్టీని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ప్రజాస్వామిక పాలన కోసం రాజకీయం పోరాటం చేయాలనుకుంటున్నానని, అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని సోనియాకు వివరించారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు అధ్యక్షురాలికి రాసిన లేఖలో పేర్కొన్నారు రాజగోపాల్‌రెడ్డి.

మరోవైపు మునుగోడులో కేడర్‌కు ధైర్యం చెప్పేందుకు రెడీ అయ్యారు కాంగ్రెస్‌ నేతలు. శుక్రవారం చుండూరు జడ్పీ హైస్కూల్‌ గ్రౌండ్‌లో జరిగే సభ ఏర్పాట్లను పరిశీలించారు. సీనియర్‌ నేతలు దామోదర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మల్లు రవితోపాటు లోకల్‌ లీడర్లు అక్కడే మకాం వేశారు. రాజగోపాల్‌రెడ్డి ఒక్కరే రాజీనామా చేశారని, కేడర్‌ అంతా కాంగ్రెస్‌తోనే ఉందని చెప్పారు దామోదర్‌రెడ్డి. మనుగోడు సభ ద్వారా పార్టీ బలంగానే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్‌. అందుకోసం పెద్దయెత్తున కేడర్‌ను సమీకరిస్తోంది. ఈ సభ నుంచే ఉప ఎన్నికకు సమర శంఖాన్ని పూరించబోతోంది కాంగ్రెస్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..