తెలంగాణలో పోటెత్తిన వరద.. తొలిసారి తెరుచుకోనున్న ఆ ప్రాజెక్టు గేట్లు..

|

Jul 19, 2024 | 11:52 PM

జూరాల ప్రాజెక్టుకు ఇంతకింతకు వరద పెరుగుతోంది. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. ప్రస్తుతం ఎడతెరపిలేని వర్షాల కారణంగా వదర ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో పోటెత్తిన వరద.. తొలిసారి తెరుచుకోనున్న ఆ ప్రాజెక్టు గేట్లు..
Jurala Project
Follow us on

మహబూబ్ నగర్ జిల్లా: జూరాల ప్రాజెక్టుకు ఇంతకింతకు వరద పెరుగుతోంది. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. ప్రస్తుతం ఎడతెరపిలేని వర్షాల కారణంగా వదర ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణతోపాటూ పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలలోని నీటి ప్రాజెక్ట్‌లు జలకళను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే గోదావరిలో వరద ఉధృతంగా ప్రవహిస్తుండగా.. కృష్ణమ్మ కూడా పరవళ్లు తొక్కుతోందా. దీంతో రేపు ఉదయం 6 గంటకు జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు.

ఎగువ నుంచి వరద ఇన్ ఫ్లో అధికంగా ఉన్న కారణంగా.. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సీజన్లో జూరాల ప్రాజెక్టుకు గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి అంటున్నారు. ఈ గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు దిగువనున్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఇరిగేషన్ శాఖ. పోలీసుల అధికారులు ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లోని 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని చెబుతున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో కూడా వరద నీరు పోటెత్తడంతో నీటిని దిగువకు వదిలి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు ప్రాజెక్టు అధికారులు.

ఈ ప్రాజెక్టు గేట్లు ఎత్తితే రైతులు తమ పంటలకు నీళ్లు అందుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్టు గేట్ల గుండా ప్రవహించి పిల్ల కాలువల ద్వారా తన పంటపొలాలు తడిచి సస్యశ్యామలంగా మారుతుందని భావిస్తున్నారు. గత కొంత కాలంగా నీటి కోసం ఎదురు చూసిన రైతులకు జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడం అత్యంత అవసరం అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ దగ్గర ఎంత వాటర్ లెవల్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. వరద ప్రవాహం ఏ మేరకు ఉందనేది పరిశీలిద్దాం. జూరాల ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో – 65,000 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో – 37,905 క్యూసెక్కులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం – 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి నిలువ 316.670 మీటర్లకు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ – 9.657 టీఎంసీలుకాగా ప్రస్తుత నీటి నిల్వ – 6.202 టీఎంసీలు ఉన్నట్లు చెబుతున్నారు. రాత్రి మరింత పెరిగే అవకాశం ఉందని అంచానా వేస్తున్నారు అక్కడి ఇరిగేషన్ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..