Telangana: మండుటెండల్లో మాంచి కూల్ న్యూస్.. తెలంగాణలో వచ్చే 4 రోజులు వద్దన్నా వానలే

|

May 21, 2022 | 4:46 PM

శుక్రవారం వికారాబాద్‌, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీవర్షాలు కురిశాయి. అప్పటికప్పుడు ఏర్పడుతున్న క్యుములోనింబస్‌ మేఘాల వల్ల గంటల వ్యవధిలోనే కుంభవృష్టి కురుస్తోంది.

Telangana: మండుటెండల్లో మాంచి కూల్ న్యూస్.. తెలంగాణలో వచ్చే 4 రోజులు వద్దన్నా వానలే
Rain Alert
Follow us on

Telangana Weather: మండుటెండల్లో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్ వచ్చింది  ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక దక్షిణ ప్రాంతం వరకూ ఉపరితల ద్రోణి రూపంలో గాలుల ప్రవాహం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటకపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. వీటి ప్రభావంతో శనివారం నుంచి 4 రోజుల పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్(IMD Yellow alert) జారీ చేసింది. అప్పటికప్పుడు ఏర్పడుతున్న క్యుములోనింబస్‌ మేఘాల(cumulonimbus clouds) వల్ల కొన్నిగంటల వ్యవధిలోనే కుంభవృష్టి మాదిరిగా భారీవర్షం కురుస్తుందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. పొలాల్లో పనులకు వెళ్లే రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇలాంటి సమయాల్లో పిడుగులు పడే అవకాశం ఉంటుందని.. చెట్ల కిందకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

కాగా  శుక్రవారం తెలంగాణలోని  రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షం దంచికొట్టింది. వికారాబాద్‌ డిస్ట్రిక్ట్ కోటిపల్లిలో 9.7, దుద్యాలలో 9.4, ధవళాపూర్‌లో 8.7, మదనపల్లి, ధారూర్‌లో 6.2, పుట్టపహాడ్, తాండూరులో 5.7, రంగారెడ్డి జిల్లా కసులాబాద్‌లో 5.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఉపరితల ద్రోణి గాలులతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కన్నా చాలా డిగ్రీలు తక్కువగా ఉంది. శుక్రవారం పగలు మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 31.5 డిగ్రీలుంది. ఈ సమ్మర్‌లో మే నెలలో ఇంత తక్కువగా పగటి ఉష్ణోగ్రత నమోదవడం ఇదే  ప్రథమం. మరోవైపు నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతం వరకూ విస్తరించాయి.