Hyderabad: హడలెత్తిస్తోన్న ఎలక్ట్రిక్‌ బైక్స్‌.. తాజాగా హైదరాబాద్‌లో పేలిన రెండు బైక్‌లు.. ఛార్జింగ్‌ అవుతుండగా..

|

Aug 16, 2022 | 7:19 AM

Hyderabad: తక్కువ ఖర్చులో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు, ఇంధన వినియోగం తగ్గడంతో కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఇవీ.. విద్యుత్‌ ఆధారిత వాహనాలతో కలిగే లాభాలు. అందుకే ప్రభుత్వాలు సైతం...

Hyderabad: హడలెత్తిస్తోన్న ఎలక్ట్రిక్‌ బైక్స్‌.. తాజాగా హైదరాబాద్‌లో పేలిన రెండు బైక్‌లు.. ఛార్జింగ్‌ అవుతుండగా..
Representative Image
Follow us on

Hyderabad: తక్కువ ఖర్చులో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు, ఇంధన వినియోగం తగ్గడంతో కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఇవీ.. విద్యుత్‌ ఆధారిత వాహనాలతో కలిగే లాభాలు. అందుకే ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి పెద్ద పీట వేస్తూ వచ్చాయి, సబ్సిడీలు అందిస్తున్నాయి. అయితే పలు సంఘటనలు చూస్తుంటే ఎలక్ట్రిక్‌ బైక్స్‌ ఎంత వరకు సురక్షితమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల పేలుతోన్న బైక్స్‌ జనాలను హడలెత్తిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఒకే రోజు రెండు ఎలక్ట్రిక్‌ బైక్స్‌ పేలడం స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ కుషాయిగూడలోని సాయినగర్‌లో సోమవారం ఛార్జింగ్ పెట్టిన రెండు బైక్స్‌ ఒక్కసారిగా పేలిపోయాయి. పేలుడు ధాటికి రెండు బైక్స్‌ తుక్కుతుక్కైపోయాయి. కనీసం బండి ఆనవాలు కూడా కనిపించకుండా పూర్తిగా ధగ్దమయ్యాయి. బైక్ ఛార్జింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకేరోజు రెండు బైక్స్‌ పేలడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బ్యాటరీలో మొదలైన మంటలు ఎలక్ట్రికల్‌ ప్యానెల్‌ బోర్డుకు అంటుకున్నాయి. అయితే బైక్‌లు పేలిన సమయంలో దగ్గర్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో రంగంలోకి దిగిన కుషాయి గూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ ప్రారంభించారు.

ఇదిలా ఉంటే ఎలక్ట్రిక్‌ బైక్స్‌ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్‌ బైక్‌ ప్రమాదాలపై నిపుణుల కమిటీని నియమించింది. నాసిరకం బ్యాటరీలతో బైక్‌లను విక్రయించిన మూడు ఈవీ తయారీ కంపెనీలపై భారీ జరిమానా వేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. దీనికి అనుగుణంగానే సదరు ఈవీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం భారీ జరిమాన విధించిన విషయం విధితమే.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..