Congress: ఆ నేత ఎంట్రీతో మళ్లీ పార్టీలో టెన్షన్.! వర్గపోరు మొదలు కానుందా.?

| Edited By: Ravi Kiran

Feb 20, 2024 | 1:04 PM

ఆ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంత మెరుగు అవుతోందట. ఈ నేపథ్యంలోనే ఒక నేత కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడంతో.. ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అందరూ కొంత ఆందోళనకు గురి అవుతున్నారట. ఇంతకీ అది ఏ నియోజకవర్గం.? అంతలా కాంగ్రెస్ పార్టీ నేతలు కలువరపడుతున్న ఆ నేత ఎవరు.?

Congress: ఆ నేత ఎంట్రీతో మళ్లీ పార్టీలో టెన్షన్.! వర్గపోరు మొదలు కానుందా.?
Congress Party
Follow us on

ఆ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంత మెరుగు అవుతోందట. ఈ నేపథ్యంలోనే ఒక నేత కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడంతో.. ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అందరూ కొంత ఆందోళనకు గురి అవుతున్నారట. ఇంతకీ అది ఏ నియోజకవర్గం.? అంతలా కాంగ్రెస్ పార్టీ నేతలు కలువరపడుతున్న ఆ నేత ఎవరు.?

పటాన్‌చెరు రాజకీయాలు ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాయి. తాజాగా ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ విషయం హాట్ టాపిక్‌గా నిలిచిందట. పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ హస్తం పార్టీ అతి తక్కువ మెజార్టీతోనే ఓటమి పాలయిందట. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపధ్యంలో ఇప్పుడు పటాన్‌చెరు నియోజకవర్గంలోనూ నూతన ఉత్సాహం వచ్చింది. అయితే ఇటీవలే ఒక నేత కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరడంతో ఇక్కడ లోకల్, సీనియర్ లీడర్లు కొంత టెన్షన్‌కు గురి అవుతున్నారట. ఆ నేత పార్టీలోకి రావడం వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అనే అనుమానాలు బాగా పెరిగిపోతున్నాయట.

పటాన్‌చెరు కాంగ్రెస్‌లోకి నీలం మధు తిరిగి రావడం.. ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేతలను తెగ టెన్షన్ పెడుతోంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయట. నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్‌కి, నీలం మధుకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందట. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మొదట పటాన్‌చెరు కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు పేరును ప్రకటించారు. కానీ కాట శ్రీనివాస్ గౌడ్ వెనక్కి తగ్గకపోవటంతో ఎమ్మెల్యే టికెట్‌ను కాట శ్రీనివాస్‌కి ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగిపోయాయట. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో వెంటనే నీలం మధు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీఎస్పీ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలుగా నామినేషన్ వేయడానికి వచ్చిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ కూడా జరిగిందట. నీలం మధు బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలవ్వగానే.. నీలం మధు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారట పటాన్‌చెరు కాంగ్రెస్ నేతలు.

ఒక దశలో నీలం మధును పార్టీలోకి తీసుకోవద్దని కాట అనుచరులు బాగా ప్రయత్నాలు చేసారట. నీలం మధు ఏ పార్టీలో ఉన్నా కూడా.. వర్గపోరు తీవ్రంగా ఉంటుంది అని వీళ్ల అభిప్రాయం. నీలం మధు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారని.. పటాన్‌చెరు బీఆర్ఎస్‌లో నీలం మధు చేరకముందు అసలు ఆ పార్టీలో వర్గపోరు అనేది లేదు, నీలం మధు చేరిన తర్వాత బాగా వర్గ పోరు పెరిగిందని.. ఇప్పుడు అదే వర్గపోరు కాంగ్రెస్ పార్టీలో మొదలు అవుతుందని పటాన్‌చెరు కాంగ్రెస్ నేతలు చాలామంది గుసగుసలాడుతున్నారు.

మరోవైపు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని, దామోదర రాజనర్సింహని ఇష్టం వచ్చినట్లు తిట్టిన నీలం మధును మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారో ఎవరికి అర్ధం కావడం లేదట. బయట పార్టీలో నుండి తమ పార్టీలోకి ఎవరైనా వస్తే సంతోషంతో ఆహ్వానిస్తారు. ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదట. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఇప్పుడే కొంత మెరుగు పడుతున్న నేపథ్యంలో మళ్ళీ ఈ కొత్త సమస్య అవసరమా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట కాంగ్రెస్ శ్రేణులు. మరోవైపు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా.. తమ నేత కాట శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడలేదని, పార్టీ లైన్ దాటలేదని, మా నేతను కానీ మమ్మల్ని కానీ డిస్టర్బ్ చేస్తే సహించేది లేదని కాటం అనుచరులు.. సీనియర్ నేతల వద్ద తమ మనసులోని మాటను బయటపెట్టారట. దీనికి సీనియర్లు కూడా స్పందించి మీకు మీ నేతకు మేము ఉన్నాం అని, భరోసా ఇచ్చారట. అయిన మొన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు పరిస్థితి ఒకే ఒరలో రెండు కత్తులు అన్న చందంగా మారిందని.. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు. ఇద్దరు నేతల వల్ల పార్టీలో వర్గ పోరు ఏమైనా మొదలవుతుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.