GN Saibaba: ‘‘నేను చావును నిరాకరిస్తున్నాను’’.. పదేళ్లు జైలుగోడల మధ్య ఎందుకు మగ్గాల్సి వచ్చింది?

నరహంతకుడు కాదు. కరడుగట్టిన నేరస్తుడూ కాదు. విద్యార్థులకు పాఠాలు చెప్పే అధ్యాపకుడు. తన జ్ఞానం పదిమందికీ పంచాలనుకునే విద్యావంతుడు. వీల్‌ఛైర్‌నుంచే భవిష్యత్తు ప్రపంచాన్ని వీక్షించిన స్వప్నికుడు. ఓరోజు ఆయన చట్టం దృష్టిలో దేశద్రోహి అయ్యారు. చేయని నేరానికి పదేళ్లు శిక్ష అనుభవించారు.

GN Saibaba: ‘‘నేను చావును నిరాకరిస్తున్నాను’’.. పదేళ్లు జైలుగోడల మధ్య ఎందుకు మగ్గాల్సి వచ్చింది?
Professor Sai Baba
Follow us

|

Updated on: Oct 14, 2024 | 9:10 PM

నరహంతకుడు కాదు. కరడుగట్టిన నేరస్తుడూ కాదు. విద్యార్థులకు పాఠాలు చెప్పే అధ్యాపకుడు. తన జ్ఞానం పదిమందికీ పంచాలనుకునే విద్యావంతుడు. వీల్‌ఛైర్‌నుంచే భవిష్యత్తు ప్రపంచాన్ని వీక్షించిన స్వప్నికుడు. ఓరోజు ఆయన చట్టం దృష్టిలో దేశద్రోహి అయ్యారు. చేయని నేరానికి పదేళ్లు శిక్ష అనుభవించారు. మానసికంగా శారీరకంగా పీల్చిపిప్పిచేసిన ఈ వ్యవస్థపై అలుపెరగని పోరాటంలో చివరికి గెలిచారు. కానీ మరణాన్ని జయించలేకపోయారు. ప్రొఫెసర్‌ సాయిబాబా అమర్‌రహే.. ఆయన తుదిశ్వాస తర్వాత మనసున్న ప్రతీ గుండెలో మారుమోగుతున్న నినాదమిదే. ఎందుకు ఈ వ్యవస్థ ముందు సాయిబాబా దోషిగా నిలబడాల్సి వచ్చింది? పదేళ్లు జైలు గోడల మధ్య ఎందుకు మగ్గాల్సి వచ్చింది? వైకల్యాన్ని జయించి ఈ స్థాయికి ఎదిగిన ప్రొఫెసర్‌.. 57ఏళ్ల వయసులోనే ఎందుకు మరణించాల్సి వచ్చింది?..

హక్కుల కోసం తపించే గుండె సవ్వడి ఆగిపోయింది.. ప్రశ్నించే ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది.. వైకల్యం శరీరానికే కానీ ఆయన మనసుకి కాదు.. అంతులేని ఆలోచనల విస్ఫోటనంలాంటి ఆ మెదడు జ్ఞాపకాల దొంతరలను మిగిల్చింది.. 90శాతం వైకల్యం. ఒకరి సహాయం లేకుండా కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని ఆ దేహం కొందరిని ఎందుకంత భయపెట్టింది? ఆ వీల్‌ఛైర్‌ చక్రాల కదలిక కూడా కొందరికి ఎందుకంత ప్రమాదకరంగా కనిపించింది? జైలు గోడల మధ్యే ఆ ఊపిరి ఆగిపోవాలని కోరుకునేంత నేరం ఆయనేం చేశారు. దుర్భేద్యమైన జైలు గోడల మధ్య కూడా పదేళ్లు మొండికేసి నిలిచిన ప్రాణం.. బయటికొచ్చేసరికి అలసిపోయింది. ఇక సెలవంటూ వెళ్లిపోయింది.

పరిచయం అక్కర్లేని పేరు. అందరూ పలవరించిన పేరు. ప్రొఫెసర్‌ సాయిబాబా.. గోకరకొండ నాగ సాయిబాబా. బయటి ప్రపంచాన్ని చూస్తారని అనుకోని సమయంలో శిక్షించిన న్యాయస్థానాలే తీర్పులని సమీక్షించుకోవటంతో.. జైలు గోడల నుంచి బయటపడ్డ ఓ మేథావి. వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని తన ఆలోచనల విస్ఫోటనంతో చైతన్యాన్ని రగిలించిన విద్యావేత్త. మానవహక్కుల కార్యకర్త. 57ఏళ్ల వయసులోనే ఆయన ఊపిరి ఆగిపోయింది. జైలుగోడలమధ్య దారుణమైన అనుభవాలతో తట్టుకోలేకపోయిన ఆ దేహం.. బాహ్యప్రపంచాన్ని చూసేందుకే పంటిబిగువన ఊపిరిని ఆపుకున్నట్లుంది. తీవ్ర అనారోగ్యంతో గతనెల 19న నిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన ప్రొఫెసర్‌ సాయిబాబా ఆరోగ్యం క్షీణించింది. శనివారం రాత్రి ఆయన కన్నుమూయటంతో.. సమాజంకోసం ఇలాంటి ప్రొఫెసర్లు పదికాలాలపాటు బతకాలని తపించే వేల గుండెలు బద్దలయ్యాయి.

పోరాటాలకు నిలువెత్తు స్ఫూర్తిగా నిలిచే హైదరాబాద్‌ గన్‌పార్క్‌ దగ్గర ప్రొఫెసర్‌ సాయిబాబాకు దక్కిన నివాళులు ఆయన వ్యక్తిత్వానికి తార్కాణం. ప్రజాభిమానమే ఆయన సంపాదించిన ఆస్తిపాస్తులు. ప్రజలు, సన్నిహితుల సందర్శనార్థం గన్‌పార్క్‌ దగ్గర ప్రొఫెసర్‌ సాయిబాబా భౌతికకాయాన్ని ఉంచినప్పుడు కొందరి కళ్లల్లోంచి ఉబికివచ్చే కన్నీళ్లను ఆపలేకపోయారెవరూ. ఆయన ఇకలేరన్న బాధకంటే.. పదేళ్లు జైలుగోడలమధ్య ఆయన అనుభవించిన నరకయాతనని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారెందరో. మౌలాలిలోని ఇంట్లో ప్రొఫెసర్‌ కడసారి చూపుకోసం సన్నిహితులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రొఫెసర్‌ సాయిబాబా కోరికమేరకు ఆయన కళ్లను ఎల్వీప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి దానం చేశారు. అంతియయాత్రతో కన్నీటి నివాళి అర్పిస్తూ ప్రొఫెసర్‌ సాయిబాబా భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగించారు.

అమలాపురంలో నుంచి హైదరాబాద్.. ఢిల్లీకి..

వ్యవస్థ ప్రొఫెసర్‌ సాయిబాబాపై దేశద్రోహి అనే ముద్రేసి ఉండొచ్చు. కానీ ఆయన వృత్తిపరంగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే అధ్యాపకుడు. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం నల్లమిల్లి రైతు కుటుంబంలో1967లో జన్మించారు సాయిబాబా. తల్లిదండ్రులు గోకరకొండ సత్యనారాయణమూర్తి, సూర్యావతి. ఐదేళ్ల వయసులో పోలియో సోకి రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నా.. చదువులో ఎప్పుడూ ముందుండేవారు ఆయన. అమలాపురంలోని శ్రీకోనసీమ భానోజీ రామర్స్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాక హైదరాబాద్ యూనివర్సిటీలో పీజీ చేశారు ప్రొఫెసర్‌ సాయిబాబా. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేస్తూనే పీహెచ్‌డీ పూర్తిచేశారు. 1992లో హైదరాబాద్‌ యూనివర్సిటీలో చదివేటప్పుడు వామపక్ష భావజాలానికి ఆకర్షితుడయ్యారు. ఆల్‌ ఇండియా పీపుల్స్‌ రెసిస్టెన్స్‌ ఫోరమ్‌లో చేరారు. ఏఐఆర్‌పీఎఫ్‌కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. దీని తర్వాత ఆర్డీఎఫ్‌ ఆనే సంస్థతో కూడా అనుబంధాన్ని కొనసాగించారు. తెలంగాణ ప్రజా ఉద్యమాలే తనని చైతన్యపరిచాయని, తనని వ్యక్తిగా తీర్చిదిద్దాయని చెప్పుకునేవారు ప్రొఫెసర్‌ సాయిబాబా.

ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ 2014లో ప్రొఫెసర్‌ సాయిబాబాని అరెస్ట్‌ చేశారు మహారాష్ట్ర పోలీసులు. అరెస్ట్‌ సమయంలోనే పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 2014 మే 9న వీల్‌ఛైర్‌ నుంచి ప్రొఫెసర్‌ని లాగేసి వాహనంలోకి దాదాపుగా విసిరేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. ఆయన ప్రతిఘటిస్తారనో పారిపోతారనో కాదు ఆ బలప్రయోగం. ఆయన శరీరం సహకరించదని తెలుసు. ఎటూ వెళ్లలేరని తెలుసు. కానీ ఆయన్ని జైలుగోడలమధ్య బంధించాలని ఆరాటపడ్డ వ్యవస్థ భయం ఆయన్ని చూసి కాదు.. ఆయన ఆలోచనలను చూసి. ఆయన మస్తిష్కం అణుబాంబులా భయపెట్టింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని.. ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు ఐదుగురిపై ఉపా కేసులు పెట్టింది. ఈ కేసులో 2017లో గడ్చిరోలి ట్రయ‌ల్‌ కోర్టు ప్రొఫెసర్‌ సాయిబాబాతో పాటు జర్నలిస్ట్‌ ప్రశాంత్‌ రాహి, జేఎన్‌యూ పరిశోధక విద్యార్థి హేమ్‌ మిశ్రా, పాండు నరోత్, మహేశ్‌ టిర్కిలకు జీవితఖైదు విధించింది. వీరితో పాటు విజయ్‌ టిర్కికి పదేళ్ల జైలుశిక్ష విధించింది, దేశంపై యుద్ధం చేయడానికి కుట్ర పన్నారని, నిషేధిత మావోయిస్టు పార్టీతో వీరికి సంబంధాలున్నాయని అభియోగాలు మోపింది మహారాష్ట్ర ప్రభుత్వం.

అరెస్టయినప్పటి నుంచి..

2014లో అరెస్టయినప్పటినుంచీ పదేళ్లు నాగ్‌పూర్‌ జైల్లో బందీ అయ్యారు ప్రొఫెసర్‌ సాయిబాబా. అక్కడ ప్రతీక్షణం దుర్భరమే. వైకల్యమున్న ఖైదీ అయినా కనికరం లేకుండా వ్యవహరించింది జైలుయంత్రాంగం. కాలకృత్యాలు తీర్చుకోడానికి కూడా నరకయాతన పడాల్సి వచ్చింది. తన ఆరోగ్యం క్షీణించిందని, వైద్యచికిత్స అందించాలని ప్రొఫెసర్‌ సాయిబాబా చేసుకున్న అభ్యర్థనలు జైలుగోడలమధ్యే సమాధి అయ్యాయి. ఆ పదేళ్లలో ఆయనకోసం సామాజికవేత్తలు, పౌరహక్కుల నేతలు, చివరికి అంతర్జాతీయ సంస్థలు కూడా పోరాడినా అన్నీ చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే మిగిలాయి. ఆయన సజీవంగా బయటికి వస్తారన్న నమ్మకం కోల్పోయారంతా. ఏ క్షణం ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని అనుక్షణం ఆవేదన అనుభవించారు. 2014లో ప్రొఫెసర్‌ సాయిబాబాని సస్పెండ్‌ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ… 2021లో ఆయన్ని విధుల నుంచి పూర్తిగా తొలగించింది. న్యాయపోరాటంలోనూ ప్రొఫెసర్ సాయిబాబాకి అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. గడ్చిరోలి కోర్టు తీర్పుపై విచారణ జరిపిన ముంబయి హైకోర్టు.. 2022 అక్టోబరు 14న ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది. మర్నాడే ఆ తీర్పును నిలిపేసిన సుప్రీంకోర్టు.. పునర్విచారణకు ఆదేశించింది. మళ్లీ విచారణ జరిపిన ముంబయి హైకోర్టు.. 2024 మార్చి 5న సాయిబాబా తదితరులను నిర్దోషులుగా ప్రకటించింది. కేసులో సమర్పించిన సాక్ష్యాలు నమ్మశక్యంగా లేవని పేర్కొంది. చివరికి న్యాయం జరిగింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. పదేళ్ల తర్వాత ఈ ఏడాది మార్చి7న‌ నిర్దోషిగా జైలుగోడలనుంచి బయటికొచ్చారు.

వందమంది దోషులు తప్పించుకున్నా ఒక నిరపరాధిని శిక్షించకూడదనేది మన న్యాయవ్యవస్థ పాటించే సూత్రం. మరి ఆ మేథావి విషయంలో ఈ న్యాయం ఎందుకు వర్తించలేదన్న సందేహం జైలుగోడల మధ్యే సమాధైపోయింది. చట్టం ఎవరికీ చుట్టం కాదు.. నిజమే కానీ ఆ చట్టమే ప్రొఫెసర్‌ సాయిబాబా విషయంలో ఎందుకంత కర్కశంగా వ్యవహరించిందనేది మేథావులు, విద్యావంతులు, ఆయన భావజాలాన్ని సమర్థించేవారు సంధిస్తున్న ప్రశ్న. సెలబ్రిటీలో, రాజకీయ ఖైదీలో అయితే జైళ్లలో ఏ లోటూ ఉండదు. కానీ సామాన్యుల గురించి గొంతెత్తే సాయిబాబాలాంటి మేథావులను కరడుగట్టిన నేరస్తుల్లాగే చూస్తుంది మన జైళ్ల వ్యవస్థ. ఆహారం తీసుకునేందుకు ఇబ్బందవుతుందన్నా స్ఫూన్‌ని, ఫోర్క్‌ని కూడా అనుమతించనంత కర్కశత్వం ఎవరినైనా కన్నీరుపెట్టిస్తుంది. తన వైకల్యాన్ని, అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గృహనిర్బంధానికి అనుమతించాలన్న అభ్యర్థనని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశానికి వ్యతిరేకంగా ప్రొఫెసర్‌ ఎలాంటి కుట్రలు చేయలేదన్న వాదనని సుప్రీం తోసిపుచ్చింది. తీవ్రవాద, మావోయిస్టు కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన పనన్లేదన్న సుప్రీంకోర్టు.. ఇలాంటి వ్యవహారాల్లో మెదడే ఎక్కువ ప్రమాదకరమైందంటూ చేసిన వ్యాఖ్యలు మేథావి వర్గాన్ని ఆలోచనలో పడేశాయి.

తీవ్ర అనారోగ్యంలోనూ..

అనారోగ్యంతో బాధపడ్డా, శరీరం సహకరించకపోయినా జైలు గోడలమధ్య ప్రొఫెసర్‌ సాయిబాబాకి ఏ మినహాయింపూ ఇవ్వలేదు చట్టం. జైలు జీవితంలో 21 రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యారు ప్రొఫెసర్‌ సాయిబాబా. కరోనా సమయంలో ఆయన అనారోగ్యంపై ఆందోళన వ్యక్తమైనా విముక్తి లభించలేదు. జైల్లో సరైన సదుపాయాలు కల్పించడం లేదని.. కరోనా వైరస్ సాకుతో చంపటానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారాయన. వీల్‌ఛైర్ తిరగని సెల్‌లో ప్రొఫెసర్‌ని ఉంచారు. అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిని ఉంచే ‘అండా’ సెల్‌లో ఆయన్ని నిర్బంధించారు. జైలు జీవితంలో అనుభవించిన టార్చర్‌ ఒక ఎత్తయితే.. తల్లి చివరిచూపునకు కూడా నోచుకోలేకపోవడం ప్రొఫెసర్‌ సాయిబాబాని కుంగదీసింది. వైకల్యమున్న తనను కంటికి రెప్పలా పెంచిన తల్లికి అనారోగ్యంగా ఉందని, ఆమెను చూసేందుకు పెరోల్‌ ఇవ్వాలని వేడుకున్నా ఎవరి మనసూ కరగలేదు. చివరికి కన్నతల్లి చనిపోయినా చివరి చూపులకు, కర్మకాండలకు హాజరయ్యేందుకు కూడా ప్రొఫెసర్‌ సాయిబాబాకి అనుమతి లభించలేదు. అమ్మో ఆయన బయటికొస్తే ఇంకేమన్నా ఉందా.. భూమ్యాకాశాలు ఏకమైపోవూ. మరణశిక్షపడ్డా ఉరితాడుకు వేలాడినప్పుడు కొన్ని క్షణాలే బాధుంటుందేమో. పదేళ్లు అంతకుమించిన యాతన అనుభవించారు ప్రజలకోసం పరితపించే ప్రొఫెసర్‌.

దేశలోని సామాజికవేత్తలు, పౌరసంఘాలే కాదు అంతర్జాతీయంగా కూడా ప్రొఫెసర్‌ సాయిబాబాకి జరిగిన అన్యాయంపై చర్చ జరిగింది. ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని ఏకంగా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం భారత ప్రభుత్వాన్ని కోరింది. 2018 జూన్ 28న విడుదలచేసిన ప్రకటనలో.. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కారణంతో జీవితఖైదు విధించడం హక్కుల ఉల్లంఘనేనంది యూఎన్‌వో. అనారోగ్యంతో చక్రాలకుర్చీకే పరిమితమైన వ్యక్తిని ఇబ్బంది పెట్టొద్దని సూచించింది. ఎవరు మంచోడో ఎవరు చెడ్డోడో మనంకదా చెప్పాల్సింది. తగుదునమ్మా అంటూ అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకుంటే వింటామా ఏంటీ.. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తాం. ఐక్యరాజ్యసమితి కంఠశోఠకే విలువలేకుండా పోతే ఇక ఈ సంఘాలు, మనుషుల గోస ఎవరికి పడుతుంది? జైలుగోడలమధ్యే ఊపిరి ఆగిపోతే దేశం సురక్షితమని నమ్మే నమ్మించే వ్యవస్థలో ఓ ప్రొఫెసర్‌ ప్రాణానికి విలువేముంది? అయినా కాలంతో పోరాడుతూనే వచ్చారు ప్రొఫెసర్‌ సాయిబాబా. జైల్లో ఉండగానే కవితలు, లేఖలతో సాయిబాబా సంకలనం రచించారు. ఎందుకు నా మార్గం గురించి మీరు భయపడుతున్నారని మనసులేని వ్యవస్థని నిగ్గదీసి అడిగిన సాహసి సాయిబాబా..

జైలు నుంచి బయటికొచ్చాక ప్రొఫెసర్‌ సాయిబాబా రాసిన ఓ కవిత వైరల్‌ అయింది..

‘‘నేను చావును నిరాకరిస్తున్నాను..

అత్యంత ప్రియమైన వసంతా

నేను చనిపోవడానికి నిరాకరించినపుడు

నా సంకెళ్లు వదులు చేసారు

నేను విశాలమైన మైదానాల్లోకి గడ్డి పూలవైపు చిరునవ్వులు చిందిస్తూ వచ్చాను

నా దరహాసం వాళ్లకు అసహనం కలిగించింది.

వాళ్లు నాకు మళ్లీ గొలుసులు వేశారు”

అంటూ ప్రొఫెసర్‌ సాయిబాబా గుండెలోతుల్లోని ఆవేదన అక్షరాల్లో ప్రవహించింది. జైలు జీవితం, అనుభవించిన వేదన వివరించేందుకు తనకు రోజులు చాలవంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. విడుదల తర్వాత హైదరాబాద్‌లో భార్య వసంత, కుమార్తె మంజీరాతో ఏడ్నెల్లుగా ఉంటున్న ప్రొఫెసర్‌ సాయిబాబా.. ఈ పదేళ్ల జైలు జీవితంలో చాలా కోల్పోయానని తుది శ్వాసదాకా ఆవేదన చెందుతూనే వచ్చారు. స్టూడెంట్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. నాకెంతో ఇష్టమైన తరగతులకు దూరమయ్యాను. జైల్లో ఉన్నప్పుడు కూడా పాఠాలు చెబుతున్నట్లు, పిల్లలతో మాట్లాడుతున్నట్లు కలలు వచ్చేవని చెప్పుకున్నారు. జైల్లో ఎదురైన ఆరోగ్య సమస్యలే జైలు నుంచి బయటపడ్డా ఆయన ప్రాణాలు తీశాయి. గాల్‌బ్లాడర్ ఆపరేషన్ జరిగింది. దాన్ని తొలగించి స్టంట్ వేసిన చోట చీము పట్టింది. అంతర్గత రక్తస్రావంతో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, హైఫీవర్‌తో బాధపడ్డారు సాయిబాబా. బీపీ పడిపోయి చివరికి హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశారు.

పోయిన మనిషికి పునర్జన్మ ఉందో లేదో తెలీదు. కానీ పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదు. చావుపుట్టుకల మధ్య జీవితాన్ని ఎలా సార్ధకం చేసుకున్నామన్నదాన్ని బట్టే చరిత్రపుటల్లో మనకంటూ కొన్ని వాక్యాలైనా మిగులుతాయి. కానీ ప్రొఫెసర్‌ సాయిబాబా ధన్యజీవి. జైలుగోడలమధ్య ఉండగానే ఆయన గురించి ఎన్నో గుండెలు బాధపడ్డాయి. ఆయనకోసం వర్షించిన ఎన్నో అశ్రువులు ఈ భూమిలో ఇంకిపోయాయి. జైలుగోడల నుంచి బయటికొచ్చినప్పుడు అంతా ఆత్మీయంగా చూసుకున్నారు. అందరి ప్రేమను పొందిన ప్రొఫెసర్‌ ఇప్పుడు భౌతికంగా లేకపోవచ్చేమో. కానీ ఆయన భావజాలం, పోరాట స్ఫూర్తి కొందరిని కలకాలం నడిపిస్తూనే ఉంటాయి. వ్యవస్థ దృష్టిలో ఆయన ప్రమాదకరమైన అర్బన్‌ నక్సలైట్‌ కావచ్చు. కానీ దోపిడీని ప్రశ్నించేవారికి, మానవహక్కులకోసం పరితపించేవారికి ఆయన.. మరణం లేని పోరాటయోధుడు. ప్రజలకోసమే బతికిన నీలాంటి మనుషులు మళ్లీ పుట్టాలి కామ్రేడ్‌ అంటూ పలువురు నివాళులర్పిస్తున్నారు.

వందమంది దోషులు తప్పించుకున్నా..

వందమంది దోషులు తప్పించుకున్నా ఒక నిరపరాధిని శిక్షించకూడదనేది మన న్యాయవ్యవస్థ పాటించే సూత్రం. మరి ఆ మేథావి విషయంలో ఈ న్యాయం ఎందుకు వర్తించలేదన్న సందేహం జైలుగోడల మధ్యే సమాధైపోయింది. చట్టం ఎవరికీ చుట్టం కాదు.. నిజమే కానీ ఆ చట్టమే ప్రొఫెసర్‌ సాయిబాబా విషయంలో ఎందుకంత కర్కశంగా వ్యవహరించిందనేది మేథావులు, విద్యావంతులు, ఆయన భావజాలాన్ని సమర్థించేవారు సంధిస్తున్న ప్రశ్న.

సెలబ్రిటీలో, రాజకీయ ఖైదీలో అయితే జైళ్లలో ఏ లోటూ ఉండదు. కానీ సామాన్యుల గురించి గొంతెత్తే సాయిబాబాలాంటి మేథావులను కరడుగట్టిన నేరస్తుల్లాగే చూస్తుంది మన జైళ్ల వ్యవస్థ. ఆహారం తీసుకునేందుకు ఇబ్బందవుతుందన్నా స్ఫూన్‌ని, ఫోర్క్‌ని కూడా అనుమతించనంత కర్కశత్వం ఎవరినైనా కన్నీరుపెట్టిస్తుంది. తన వైకల్యాన్ని, అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గృహనిర్బంధానికి అనుమతించాలన్న అభ్యర్థనని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశానికి వ్యతిరేకంగా ప్రొఫెసర్‌ ఎలాంటి కుట్రలు చేయలేదన్న వాదనని సుప్రీం తోసిపుచ్చింది. తీవ్రవాద, మావోయిస్టు కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన పనన్లేదన్న సుప్రీంకోర్టు.. ఇలాంటి వ్యవహారాల్లో మెదడే ఎక్కువ ప్రమాదకరమైందంటూ చేసిన వ్యాఖ్యలు మేథావి వర్గాన్ని ఆలోచనలో పడేశాయి.

పోయిన మనిషికి పునర్జన్మ ఉందో లేదో తెలీదు. కానీ పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదు. చావుపుట్టుకల మధ్య జీవితాన్ని ఎలా సార్ధకం చేసుకున్నామన్నదాన్ని బట్టే చరిత్రపుటల్లో మనకంటూ కొన్ని వాక్యాలైనా మిగులుతాయి. కానీ ప్రొఫెసర్‌ సాయిబాబా ధన్యజీవి. జైలుగోడలమధ్య ఉండగానే ఆయన గురించి ఎన్నో గుండెలు బాధపడ్డాయి. ఆయనకోసం వర్షించిన ఎన్నో అశ్రువులు ఈ భూమిలో ఇంకిపోయాయి. జైలుగోడల నుంచి బయటికొచ్చినప్పుడు అంతా ఆత్మీయంగా చూసుకున్నారు. అందరి ప్రేమను పొందిన ప్రొఫెసర్‌ ఇప్పుడు భౌతికంగా లేకపోవచ్చేమో. కానీ ఆయన భావజాలం, పోరాట స్ఫూర్తి కొందరిని కలకాలం నడిపిస్తూనే ఉంటాయి. వ్యవస్థ దృష్టిలో ఆయన ప్రమాదకరమైన అర్బన్‌ నక్సలైట్‌ కావచ్చు. కానీ దోపిడీని ప్రశ్నించేవారికి, మానవహక్కులకోసం పరితపించేవారికి ఆయన.. మరణం లేని పోరాటయోధుడిగా మారారు..

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి