HYDRA: ఫిర్యాదు అందితే చాలు వాలిపోతారంతే.. ఫుల్‌ స్పీడులో దూసుకెళ్తున్న హైడ్రా.. అక్రమ కట్టడాలపై పంజా..

|

Aug 11, 2024 | 7:18 AM

హైడ్రా యమా స్పీడు మీదుంది. తెలంగాణ రాష్ట్ర ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా... దూసుకెళ్తోంది. చెరువులు, కబ్జా స్థలాల్లోని నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చిపడేస్తోంది. రాజకీయ నేతల బిల్డింగులకు సైతం బద్దలుకొడుతోంది హైడ్రా..

HYDRA: ఫిర్యాదు అందితే చాలు వాలిపోతారంతే.. ఫుల్‌ స్పీడులో దూసుకెళ్తున్న హైడ్రా.. అక్రమ కట్టడాలపై పంజా..
Hydra
Follow us on

తెలంగాణ రాష్ట్ర ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా… దూసుకెళ్తోంది. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా ఝుళిపిస్తోంది. చెరువులు, కబ్జా స్థలాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తూ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చురుకుగా వ్యవహరిస్తూ ఫుల్‌ స్పీడుమీదున్నారు.

ఇక రాజేంద్రనగర్‌ పరిధి శివరాంపల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది హైడ్రా. చెరువును ఆక్రమించిన కబ్జాదారులు ఏకంగా ప్లాట్లు వేసి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. మొత్తం 5 బిల్డింగులతో పాటు ఓ 25 కాంపౌండ్‌ వాల్స్‌ను జేసీబీ సాయంతో హైడ్రా కూల్చేసింది. అక్రమ నిర్మాణాల తొలగింపును ఎవరు అడ్డుకోకుండా పోలీసుల భారీగా బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు జరిగాయి.

అక్రమ కట్టడాలు రాజకీయ నాయకులకు చెందినవైనా సరే… ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు హైడ్రా. బిల్డింగులను కూల్చివేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చిన బహదూర్‌పుర ఎమ్మెల్యే మహమ్మద్‌ ముబీన్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు స్థానిక కార్పొరేటర్‌తో పాటు పలువురుని అదుపులోకి తీసుకుని మరీ… కూల్చివేతలను కంటిన్యూ చేశారు అధికారులు.

అంతకుముందు చందానగర్‌, కుత్బుల్లాపూర్‌లోని అక్రమ కట్టడాలను సైతం ఇలానే కూల్చేశారు. చెరువులు, కబ్జా భూములపై నిర్మాణాలు జరిపారన్న కంప్లైంట్‌ వస్తే చాలు… వెంటనే అక్కడ వాలిపోతున్నారు హైడ్రా అధికారులు. పెద్ద చిన్నా ఏం లేదు…అక్రమ నిర్మాణాలు చేస్తే అందరూ ఒకటేనన్న ప్రభుత్వ ఆదేశాలతో మాంచి దూకుడు మీదున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..