హైదరాబాద్‌వాసులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడేలా..

హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఐకియా జంక్షన్‌లలో కొత్త స్కైవాక్‌ల నిర్మాణానికి ఉమ్టా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మెట్రో స్టేషన్లు, బస్ బేలు, ప్రధాన వాణిజ్య ప్రాంతాలను అనుసంధానించే ఈ స్కైవాక్‌లు రోడ్డు ప్రమాదాలను తగ్గించి, పాదచారులకు సురక్షిత ప్రయాణాన్ని అందించనున్నాయి.

హైదరాబాద్‌వాసులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడేలా..
Hyderabad Skywalks

Updated on: Aug 01, 2026 | 5:02 PM

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మరో కీలక అడుగు వేయనుంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆధునిక స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల ఏర్పాటుకు ఉమ్టా కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఉప్పల్‌లో అందుబాటులోకి వచ్చిన 360 డిగ్రీల ఎలివేటెడ్ వాక్‌వే మంచి స్పందన పొందుతుండగా, మెహదీపట్నం స్కైవాక్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇదే క్రమంలో సికింద్రాబాద్, జేఎన్‌టీయూ జంక్షన్‌లలోనూ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

తాజాగా నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఐటీ కారిడార్‌లోని ఐకియా జంక్షన్‌లలో కూడా స్కైవాక్‌ల నిర్మాణానికి ఉమ్టా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రతిరోజూ వేలాది మంది పాదచారులు, లక్షలాది వాహనాలతో కిక్కిరిసిపోయే ఈ ప్రాంతాల్లో రోడ్డు దాటడం సవాలుగా మారుతోంది. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అత్యాధునిక సౌకర్యాలతో స్కైవాక్‌లను రూపొందించనున్నారు. ఎస్కలేటర్లు, లిఫ్టులు, వర్షం, ఎండ నుంచి రక్షణ కల్పించే కవర్డ్ వాక్‌వేలతో వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

ఐటీ కారిడార్‌లో ప్రతిపాదించిన ఐకియా స్కైవాక్ ద్వారా రాయదుర్గం మెట్రో స్టేషన్‌ను మైండ్‌స్పేస్ ఐటీ పార్క్, ఐకియా స్టోర్‌తో నేరుగా అనుసంధానించనున్నారు. దీంతో ప్రతిరోజూ మెట్రోలో ప్రయాణించే వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డు దాటాల్సిన అవసరం లేకుండానే తమ కార్యాలయాలకు సురక్షితంగా చేరుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్మించనున్న స్కైవాక్ మెట్రో స్టేషన్, ఆర్టీసీ బస్ బే, సమీప నివాస ప్రాంతాలను కలుపుతూ రూపొందనుంది. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు ఎక్కువగా వినియోగించే ఈ కూడలిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు పాదచారుల భద్రతను గణనీయంగా మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us