
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. ఎంఎంటీఎస్ విస్తరణపై దక్షిణ మధ్య రైల్వే ముందడుగు వేసింది. ఇందులో భాగంగా నగరంలో మూడు కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించనుంది. ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు అల్వాల్ లయోలా కాలేజీ, ఆనంద్ బాగ్, మౌలాలీ క్వార్టర్స్ దగ్గర స్టేషన్లను నిర్మించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే ప్రతిపాదనలను సిద్దం చేసి రైల్వే బోర్డుకు పంపింది. రైల్వే బోర్డు ఆమోదం తర్వాత దక్షిణ మధ్య రైల్వే నిర్మాణం మొదలుపెట్టనుంది. ఇదే జరిగితే ఎంఎంటీఎస్ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వివిధ వర్గాల ప్రజల నుంచి వినతుల రావడంతో.. వారి డిమాండ్ల మేరకు కొత్త స్టేషన్లపై దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఘట్ కేసర్-సనత్ నగర్ మధ్య ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌లో భాగంగా రాకపోకలు మొదలయ్యాయి. దీంతో ఈ మార్గంలో కొత్త రైల్వే స్టేషన్ల అవసరం పడింది. లయోలా కాలేజీ వద్ద కొత్త స్టేషన్ నిర్మించాలని విద్యార్థులు, స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీంతో ఇటీవల రైల్వే బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి స్టేషన్ నిర్మాణానికి సాంకేతిక అవకాశాలను పరిశీలించింది. అనంతరం దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ప్రతిపాదనలు పంపారు. అవి ఇప్పుడు రైల్వే బోర్డుకు పంపాల్సి ఉంది. రైల్వే బోర్డు ఆమోదిస్తే వెంటనే పనులు మొదలుపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే కాలేజీకి వచ్చే విద్యార్థులతో పాటు స్థానికులకు ప్రయోజనం చేకూరనుంది.
ఇక చర్లపల్లి నుంచి నేరేడ్ మెట్ వరకు ఒక్క స్టేషన్ కూడా అందుబాటులో లేదు. దీంతో మల్కాజ్ గిరి చుట్టుపక్కల నివసించేవారు ట్రైన్ ఎక్కాలంటే చాలాదూరం వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఆనంద్ బాగ్‌లో కొత్త స్టేసన్ నిర్మించే మల్కాజ్ గిరి పరిధిలో నివసించేవారికి ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. ఇక మౌలాలీలో కూడా నిర్మిస్తే చుట్టుపక్కల నివసించేవారికి ఉపయోగం కలగనుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంఎంటీఎస్ విస్తరణకు తోడ్పాటు అందిస్తోంది. రెండో దశ పనుల కోసం నిధులను విడుదల చేసింది. ఎంఎంటీఎస్ విస్తరణలో నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఎంఎంటీఎస్ విస్తరణకు తన వంతు నిధులు సమకూర్చుతుంది. అటు యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరించాలని రైల్వేశాఖ భావించింది. దీని వల్ల నగర శివారులో నివసించేవారు నగరంలోకి చేరుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ పనులు ఇంకా మొదలుకాలేదు. త్వరలోనే మొదలయ్యే అవకాశముందని తెలుస్తోంది.