త‌స్మాత్ జాగ్ర‌త్త‌..క‌రోనా వేళ‌ ప్లాస్మా డోనేట్ చేస్తానంటూ మోసం..

|

Jul 15, 2020 | 2:43 PM

క‌రోనా వీర‌విహారం చేస్తోన్న ఇలాంటి స‌మయంలో కూడా మ‌నుషుల జీవితాలే పెట్టుబ‌డిగా మోసాల‌కు తెగ‌బ‌డుతున్నారు కేటుగాళ్లు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

త‌స్మాత్ జాగ్ర‌త్త‌..క‌రోనా వేళ‌ ప్లాస్మా డోనేట్ చేస్తానంటూ మోసం..
Follow us on

ప్ర‌స్తుతం క‌రోనా కాలం. ప్రాణాల‌తో వైర‌స్ చెల‌గాట‌మాడుతోంది. ఈ స‌మయంలో ఒక‌రి నుంచి ఒక‌రికి చేయూత అవ‌స‌రం. ఉమ్మ‌డిగా వ్యాధిపై పోరాటం చేయాల్సిన స‌మయం. అందుకు త‌గ్గ‌ట్లుగానే కోవిడ్-19 నుంచి రిక‌వ‌ర్ అయిన పేషెంట్స్ చాలామంది ప్లాస్మా డోనేట్ చేసేందుకు ముందుకు వ‌స్తూ..తమ పెద్ద మ‌న‌సు చాటుకుంటున్నారు. మ‌రొక‌రి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ కొంద‌రు వెద‌వ‌లు ఈ విష‌యాన్ని కూడా మోసాల‌కు అనువుగా మార్చుకుంటున్నారు. డ‌బ్బులిస్తే ప్లాస్మా దానం చేస్తామంటూ చెప్పి ప్రయాణ ఖ‌ర్చుల‌కు ఖాతాలో డ‌బ్బులు జ‌మ చేయ‌గానే మాయ‌మ‌వుతున్నారు కేటుగాళ్లు. తాజాగా ఇటువంటి కేసే హైద‌రాబాద్ న‌గ‌రంలో వెలుగుచూసింది.

ఇటీవ‌లే న‌గరానికి చెందిన ఓ మ‌హిళ త‌న కుటుంబ సభ్యుడి కోసం ప్లాస్మా డోనేట్ చేసే వాళ్లు కావాలి అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టింది. సందీప్ రెడ్డి అనే ఐడీ పేరుతో ఉన్న‌ ఓ వ్య‌క్తి తాను దానం చేస్తానంటూ ముందుకు వ‌చ్చాడు. అయితే ప్ర‌యాణ ఖ‌ర్చల నిమిత్తం కొంత డ‌బ్బు వేయాల్సిందిగా కోరారు. దీంతో వారు 2,500 రూపాయ‌ల న‌గ‌దు అతడికి బదిలీ చేశారు. ఆ త‌ర్వాత కొంత స‌మ‌యం త‌ర్వాత ఫోన్ చేసిన అవ‌త‌లి వ్యక్తి త‌న ఖాతాలో నెగెటివ్ బ్యాలెన్స్ ఉండ‌టం వ‌ల్ల వేసిన‌ డ‌బ్బులు క‌ట్ అయిపోయాయ‌ని, మరోసారి డ‌బ్బు పంపాల్సిందిగా కోరాడు. మ‌హిళ మ‌రోసారి అత‌డి ఖాతాలో డ‌బ్బు జ‌మ చేసింది. ఆ త‌ర్వాత‌ అత‌డి నుంచి ఎటువంటి రిప్లై లేదు. క‌రోనా వీర‌విహారం చేస్తోన్న ఇలాంటి స‌మయంలో కూడా మ‌నుషుల జీవితాలే పెట్టుబ‌డిగా మోసాల‌కు తెగ‌బ‌డుతున్నారు కేటుగాళ్లు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.