మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్.. బ్రాండెడ్ బాటిళ్లలో చీప్ లిక్కర్.. బాబోయ్ పెద్ద కథే ఇది..

హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యం విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ శాతంరాయికి చెందిన అశోక్‌తో పాటు యాకూబ్ పాషాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కల్తీ మద్యం ఉన్న 10 ఫుల్ బాటిళ్లు, 30కి పైగా ఖాళీ బ్రాండెడ్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు పది మందికి విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. కొనుగోలుదారుల వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్.. బ్రాండెడ్ బాటిళ్లలో చీప్ లిక్కర్.. బాబోయ్ పెద్ద కథే ఇది..
Fake Branded Alcohol

Updated on: Nov 18, 2026 | 8:17 AM

హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యం దందా సాగిస్తున్న ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. వినియోగదారులను కళ్లుగప్పి అక్రమ వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని శాతంరాయి ప్రాంతానికి చెందిన అశోక్ అనే వ్యక్తి ఈ కల్తీ మద్యం దందాకు తెరలేపాడు. గతంలో డిస్టిలరీలో పనిచేసిన అశోక్.. ఆరు నెలల క్రితం ఉద్యోగం మానేసి క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. అయితే క్యాబ్ డ్రైవర్ ముసుగులో అక్రమ మద్యం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ విచారణలో బయటపడింది. ఈ అక్రమ దందాపై సమాచారం అందడంతో ఎక్సైజ్ పోలీసులు రంగంలోకి దిగారు. అశోక్ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మిక్సింగ్ చేసిన 10 ఫుల్ మద్యం బాటిళ్లతో పాటు మరో 30కి పైగా ఖాళీ ఖరీదైన బ్రాండ్ల సీసాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ దందాలో యాకూబ్ పాషా పాత్ర కూడా బయటపడింది. అతడి స్క్రాప్ దుకాణం నుంచే ఖాళీ బ్రాండెడ్ మద్యం బాటిళ్లను తీసుకొస్తున్నట్లు గుర్తించిన అధికారులు పాషాను కూడా అరెస్ట్ చేశారు.

ఇప్పటివరకు స్థానికంగా సుమారు పది మందికి ఈ కల్తీ మద్యాన్ని విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మద్యం కొనుగోలు చేసిన వారిని గుర్తించి విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ అక్రమ వ్యాపారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? ఈ మద్యం ఇతర ప్రాంతాలకు కూడా సరఫరా అయ్యిందా..? కొనుగోలు చేసిన ఆ పది మంది ఎవరు..? అనే కోణాల్లో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. మొత్తానికి బ్రాండెడ్ మద్యం బాటిళ్లను నమ్మి కొనుగోలు చేస్తే.. లోపల ఉన్నది నకిలీ మద్యం అయ్యే ప్రమాదం ఉందని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us