
వెజ్ లవర్స్‌కి ప్రొటీన్, కాల్షియం, ప్రోబయాటిక్స్ కావాలంటే బెస్ట్ ఛాయిస్ పన్నీర్…! గుండె, జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టాలంటే డాక్టర్స్ బెస్ట్ సజెషన్ కూడా పన్నీరే….! గేదె పాలను విరగ్గొట్టి చేసే స్వచ్ఛమైన ఆ పదార్ధాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. ఏమాత్రం కనిపెట్టలేని విధంగా నకిలీ ఫార్ములా తయారీ చేసి జేబులు నింపుకోవడమే కాదు… జనాల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో విచ్చలవిడిగా జరుగుతున్న పన్నీర్ అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆ తనిఖీల్లో వెలుగులోకొచ్చిన షాకింగ్ విషయాలు గుండె దడ పెంచుతున్నాయి.
పక్కా సమాచారంతో ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్‌తో కలిసి టాస్క్ ఫోర్స్ పోలీసులు పన్నీర్ తయారీ కేంద్రాలపై దాడులు చేయగా… ఈ కల్తీ బాగోతం బట్టబయలైంది. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ డెయిరీ ప్రోడక్ట్స్, విజయ్ మిల్క్ సహా 6 షాపుల్లో తనిఖీలు చేసి… మూడు వేల కిలోలకు పైగా కల్తీ పన్నీర్‌ని గుర్తించారు.
శ్రీ బాలాజీ డెయిరీలో 1600 కిలోలు… విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాప్‌లో 1000 కేజీలు… మిగతా ఆరు షాపుల్లో నాలుగు వందలకు పైగా కల్తీ పన్నీర్‌ని గుర్తించి సీజ్ చేశారు. కాస్త కూడా కనికరం లేకుండా కేవలం గల్లా పెట్టె నింపుకోవాలన్న అత్యాశతో ఇలాంటి దారుణానికి ఒడిగడతారా అంటూ కల్తీ కేటుగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు… ఈ తయారీ కేంద్రాల నుంచి ప్రతిరోజూ వందలాది షాపులకు పన్నీర్ వెళ్తోందన్నారు.
మొత్తంగా… పన్నీర్ కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. ఇలా అక్రమ తయారీ కేంద్రాల గురించి సమాచారముంటే వెంటనే తమను సంప్రదించాలని కోరారు.