Hyderabad: హైదరాబాద్ బిట్స్ పిలానీకి పూర్వ విద్యార్థి భారీ విరాళం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీకి అమెరికాకు చెందిన పూర్వ విద్యార్థి భారీ విరాళం ప్రకటించారు. విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించేందుకు ముందుకొచ్చారు. ప్రతీ ఏటా 16 మంది విద్యార్థులకు ఆర్ధిక సాయం అందించనున్నారు. ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు వెల్లడించారు.

Hyderabad: హైదరాబాద్ బిట్స్ పిలానీకి పూర్వ విద్యార్థి భారీ విరాళం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
Bits Pilani

Updated on: Feb 05, 2026 | 1:21 PM

హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీకి పూర్వ విద్యార్థి చంద్ పి. గార్గ్ భారీ విరాళం ప్రకటించారు. ఇక్కడ చదుకునే విద్యార్థులకు ప్రతీ ఏడాది స్కాలర్ షిప్‌లను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో 16 మందికి ప్రతీ ఏటా స్కాలర్‌షిప్‌ల ద్వారా ఆర్ధిక సాయం అందించనున్నారు. వీటిల్లో విద్యార్థినులకు ఎక్కువగా స్కాలర్ షిప్‌లను ఇవ్వనున్నట్లు తెలిపారు. చదువుపై ఆసక్తి ఉండి ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులను గుర్తించి ఈ సాయం అందించనున్నారు. ఇందుకోసం చంద్ పి గార్గ్ రూ.33 కోట్ల భారీ విరాళం బిట్స్ పిలానీకి అందించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ రూపంలో వీటిని అందించనున్నారు.

రూ.33 కోట్ల భారీ విరాళం

చంద్ పి గార్గ్ విరాళం ప్రకటించడంపై బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ వైస్ చాన్సలర్ వి.రాంగోపాల్ రావు స్పందించారు. పూర్వ విద్యార్థి 4 మిలియన్ డాలర్ల భారీ విరాళం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. బిట్స్ పిలానీతో పూర్వ విద్యార్థులకు ఉన్న లోతైన బంధాన్ని ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు. విద్యార్థులకు అండగా నిలిచేందుకు పూర్వ విద్యార్థి అందించిన అతిపెద్ద వ్యక్తిగత విరాళం ఇప్పటివరకు ఇదేనని తెలిపారు. చంద్ పి గార్గ్ 1968లో బిట్స్ పిలానీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

పెరిగిన ఫండ్

తన భార్యతో కలిసిన చంద్ గార్గ్ ఈ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నేను చదివిన కాలేజీకి కృతజ్ఞతగా ఈ విరాళం ఇస్తున్నా.. జీవితంలో నేను సాధించిందంతా బిట్స్ పిలానీలో నేను నేర్చుకున్న విషయాలోనే ప్రారంభమైంది. దీంతో ఆర్ధిక ఇబ్బందుల వల్ల విద్యార్థుల చదువు ఆగకూడదనే ఉద్దేశంతో ఈ విరాళం ప్రకటిస్తున్నా” అని పేర్కొన్నారు. కాగా చంద్ గార్గ్ ప్రకటించిన విరాళంతో బిట్స్ పిలానీ ఎండోమెంట్ ఫండ్ రూ.280 కోట్లు దాటింది.