Cyber Fraud: వాటర్ బిల్ పేరుతో కొత్త సైబర్ స్కెచ్.. ఈ మెసేజ్ వస్తే వెంటనే అలర్ట్!

హైదరాబాద్ జలమండలి వాటర్ బిల్ స్కామ్‌లపై వినియోగదారులను అప్రమత్తం చేసింది. బిల్లు బకాయి ఉందని, కనెక్షన్ తొలగిస్తామని వచ్చే నకిలీ సందేశాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అనుమానాస్పద లింక్‌లు క్లిక్ చేయవద్దు, APK ఫైల్‌లు డౌన్‌లోడ్ చేయవద్దు, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దు. అధికారిక HMWSSB మార్గాలను మాత్రమే ఉపయోగించండి. మోసపోతే వెంటనే బ్యాంక్, సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని జలమండలి కోరింది.

Cyber Fraud: వాటర్ బిల్ పేరుతో కొత్త సైబర్ స్కెచ్.. ఈ మెసేజ్ వస్తే వెంటనే అలర్ట్!
Hyderabad Water Bill Scam
Image Credit source: AI Image

Updated on: Oct 05, 2026 | 7:29 PM

హైదరాబాద్‌: వాటర్ బిల్ అప్‌డేట్ పేరుతో వచ్చే అనుమానాస్పద సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ జలమండలి (HMWSSB) వినియోగదారులను హెచ్చరించింది. వాటర్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే నీటి కనెక్షన్‌ తొలగిస్తామని, బిల్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలంటూ సైబర్‌ నేరగాళ్లు వినియోగదారులను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ సూచనలు చేసింది.

జలమండలి పేరుతో గుర్తుతెలియని నంబర్ల నుంచి ఫోన్‌ కాల్స్‌, SMSలు, వాట్సాప్‌ మెసేజ్‌లు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా సందేశాల్లో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్‌ చేయడం, APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేయడం చేయొద్దని స్పష్టం చేశారు. మొబైల్‌లో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయాలని, స్క్రీన్‌ షేరింగ్‌ లేదా రిమోట్‌ యాక్సెస్‌ ఇవ్వాలని ఎవరైనా కోరితే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని తెలిపారు.

అలాగే OTP, UPI PIN, డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు నంబర్‌, CVV, పాస్‌వర్డ్‌, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని జలమండలి సూచించింది. నీటి బిల్లుల చెల్లింపు, బిల్లు వివరాల పరిశీలన కోసం జలమండలి అధికారికంగా అందుబాటులో ఉంచిన మార్గాలను మాత్రమే ఉపయోగించాలని కోరింది.

ఇక అనుమానాస్పద లావాదేవీ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి ఖాతా లేదా కార్డుకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది. అనంతరం సైబర్‌ క్రైమ్‌ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని, అనుమానాస్పద ఫోన్‌ నంబర్లు, SMSలు, వాట్సాప్‌ సందేశాలు, లింకులు, లావాదేవీల వివరాలను ఆధారాలుగా భద్రపరచుకోవాలని పేర్కొంది.

వాటర్‌ బిల్‌ పేరుతో వచ్చిన ప్రతి మెసేజ్‌ను అధికారికమైనదిగా భావించకుండా.. ముందుగా దాని ప్రామాణికతను నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా అత్యవసరంగా బిల్లు చెల్లించాలంటూ ఒత్తిడి చేసే సందేశాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us