
పెళ్లి చేసుకోకపోయినా.. ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది గాని.. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకపోతే దారుణంగా అవమానిస్తుంది. దాంపత్య జీవితం ఎంత సాఫీగా సాగుతున్నా.. పిల్లలు లేరంటే.. అందరి దగ్గరా చిన్నబోవాల్సి వస్తుంది. దారినబోయే దానయ్య సైతం సంతానం లేకుంటే వెక్కిరించి వెళ్తాడు. అంతెందుకు.. సొంత కుటుంబీకులే నానా మాటలు అని పోతారు. ఇన్ని ఒత్తిడుల మధ్య ఆ దంపతులు డాక్టర్లను ఆశ్రయిస్తుంటారు. అక్కడ మొదలువుతుంది అసలు కథ. ఆ దంపతులపై ఉండే ఒత్తిడి, పిల్లల్ని కనాలనే ఆశ… ఎంత డబ్బైనా ఖర్చుపెడతామన్న హామీల మధ్య.. IVF సెంటర్‌లోకి అడుగుపెడతారు. అక్కడి నుంచి మొదలయ్యే ఈ ఇండస్ట్రీ.. పైకి ఒకలా.. వెనుక మరోలా కనిపిస్తుంది. IVF క్లినిక్స్ దగ్గర కాచుకుని ఉండే దళారులు తెగబడతారు. దంపతులను ప్రలోభపెడతారు.. పిల్లలు పక్కా అనే హామీలు ఇచ్చేస్తారు. దంపతుల బలహీనతే వీళ్ల పెట్టుబడి. వారి కోరికలే.. వీరి రాబడి. సక్రమ పద్దతిలో తమకు పిల్లలు పుడితే ఓకే.. పుట్టకపోయినా ఓకే అనుకునే జంటలు ఇలాంటి వారిని రిజెక్ట్ చేస్తుంటాయి. మాకు ఎలాగైనా పిల్లలు కావాలనే జంటల్ని గట్టిగా పట్టేసుకుంటుంది ఈ మాఫియా. అలా మొదలయ్యే బిజినెస్.. రోజుకు వెయ్యి రెండు వేల నుంచి మొదలై.. చివరికి లక్షల్లో లాగిపడేసే వరకు వెళ్తుంది. ...